అమ్మ ఆదర్శ పాఠశాలల మిగులు పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలి

అమ్మ ఆదర్శ పాఠశాలల మిగులు పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలి– కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌
నవతెలంగాణ-ఖమ్మం
అమ్మ ఆదర్శ పాఠశాలల మిగులు పనులు ఆగస్టులోగా పూర్తయ్యేలా కార్యాచరణ చేయాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో అధికారులతో అమ్మ ఆదర్శ పాఠశాలల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్‌ శాఖల వారీగా కేటాయించిన పాఠశాలలు, పనుల పూర్తిపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద 955 పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టగా, 508 పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తయినట్లు, 447 పాఠశాలల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ప్రతి 10 రోజులకు ఎన్ని పాఠశాలల పనులు పూర్తవుతాయో లక్ష్యం పెట్టుకొని, తదనుగుణంగా కార్యాచరణ చేయాలన్నారు. ఇచ్చిన టైం లైన్‌కు కట్టుబడి పనులు పూర్తి చేయాలన్నారు. అధికారులు అంతర్గతంగా సమీక్షలు చేసుకొని, రోజువారి పనుల పురోగతి జరిగేలా చూడాలన్నారు. పనులు తుది దశలో ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వెంటనే పూర్తయ్యేలా చూడాలన్నారు. పనులు పూర్తయిన పాఠశాలల పనుల నమోదు వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో టిజి ఇడబ్ల్యూఐడిసి ద్వారా చేపట్టిన 177 పాఠశాలల అభివద్ధి పనుల్లో 104 పనులు పూర్తి కాగా, 73 పాఠశాలల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ పనులు పీఆర్‌, ఆర్‌అండ్‌బి, గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ విభాగాలు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిధులకు ఎలాంటి సమస్యలేదని, పూర్తయిన పనులకు వెంట వెంట ఎంబి రికార్డ్‌ చేసి, చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ఇంచార్జ్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా విద్యాధికారి సోమశేఖర్‌శర్మ, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ హేమలత, ఇఇ సిహెచ్‌.వేణు, పీఆర్‌ ఇఇలు వెంకట్‌రెడ్డి, శ్రీరాం కోటి నాయక్‌, ఖమ్మం నగర పాలక సంస్థ ఇఇ కష్ణలాల్‌, గిరిజన సంక్షేమ శాఖ డిఇ బి.రాజు, విద్యాశాఖ ప్రోగ్రాం అధికారి రామకృష్ణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.