ఐఐఐటీ బాసరలో మత్తు మందు దురదృష్టకర

– డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రతిష్టాత్మకమైన బాసర ఐఐఐటీలో మత్తు మందు దొరకడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. బుదవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ నుంచి మూడోతరగతి వరకు నిర్వహించనన్ను నేపథ్యంలో ఉపాధ్యాయులు కూడా వేర్వేరుగా ఉంటారని స్పష్టత ఇచ్చారు. మండలానికో మూడు చొప్పున పాఠశాలలు, సెమీ అండ్‌ రెసిడెన్షియల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అందులో నాలుగో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన జరుగుతుందన్నారు. ప్రతి మండలానికో ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటుపై ప్రభుత్వం సమాలోచన చేస్తున్నదని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. అయినప్పటికీ కేంద్ర బడ్టెట్‌లో మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలిపారు.