– రూ.96 లక్షల మందులు సీజ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చట్టవ్యతిరేకంగా తయారీ చేసి, నిల్వ చేసిన రూ.96 లక్షల విలువైన ఔషధాలను డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరక్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, ముడుచింతలపల్లి గ్రామంలో అస్పెన్ బయోఫార్మాకు చెందిన గోదాములో వీటిని నిల్వ ఉంచారు. అస్పెన్ బయోఫార్మాకు చెందిన కడారీ సతీష్ రెడ్డిపై గతంలోనూ డీసీఏ కేసులు నమోదు చేసింది. సీజ్ చేసిన మందుల్లో యాంటీ క్యాన్సర్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ కోగలెంట్స్, యాంటీ డిప్రెసెంట్స్ తదితర రకాల ఔషధాలున్నాయి. గతేడాది డిసెంబర్లో మచ్చబొల్లారంలో పట్టుబడిన యాంటీ క్యాన్సర్ మందుల కేసులోనూ కడారి ముద్దాయి. అదే నెలలో ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, అన్నారుగూడెం గ్రామంలో నమోదు చేసిన అక్రమ తయారీ కేసులోనూ ఆయన అనుమానితునిగా ఉన్నారు.
మెడికల్ షాపు లైసెన్స్ రద్దు
చట్టవిరుద్ధంగా మందులను అమ్ముతున్న ఒక మెడికల్ షాపు లైసెన్స్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కమిషనర్ ఇచ్చిన సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యసనపరులకు షెడ్యూల్ హెచ్ 1, షెడ్యూల్ ఎక్స్ పరిధిలోకి వచ్చే మందులను పలు మెడికల్ షాపులు అమ్ముతున్నట్టు గుర్తించారు. డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా తీసుకుని మాత్రమే వీటిని రోగులకు విక్రయించాలనే నిబంధనలను ఈ మెడికల్ షాపులు ఉల్లింఘించాయి. హైదరాబాద్ వాయుపురి కాలనీలోని లక్ష్మి నర్సింహ మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌ను రద్దు చేయగా, మరో 20 మెడికల్ షాపుల్లో అమ్మకాలపై రెండు రోజుల నుంచి 60 రోజులకు వరకు నిషేధం విధించారు.