
మండల కేంద్రంలోని శాంభవి హై స్కూల్ ఆధ్వర్యంలో గురువారం బోనాల సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులతో కలిసి బోనాలు ఎత్తుకొని గ్రామంలోని పురవీధుల గుండా పెద్ద పోచమ్మ ఆలయానికి బోనాలతో చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం,మొక్కులు సమర్పించారు. గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగా పండాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నారు.బోనాల సందర్భంగా విద్యార్థినిలు సాంప్రదాయ దుస్తులను ధరించి బోనాల సంప్రదాయ విశిష్టతను చాటారు, విద్యార్థులు పోతురాజు వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు, కరస్పాండెంట్ బొట్ల రవీణ్ ప్రసాద్, ప్రిన్సిపాల్ బొట్ల ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపాల్ బొట్ల మంజుల, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.