నవతెలంగాణ – మంథని
దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని దివ్యాంగుల నెట్ వర్క్ జిల్లా కన్వీనర్ ఇనుముల సతీష్ డిమాండ్ చేశారు. మంథనిలోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది దివ్యాంగుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాల్సిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వారు మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ ద్వారా మాట్లాడటం బాధకరమన్నారు. ఐపీఎస్,ఐఎఫ్ఎస్ లో దివ్యాంగులకు సైతం రిజర్వేషన్ కల్పించాలని సూచించాల్సింది పోయి ఐఏఎస్ లో దివ్యాంగులకు రిజర్వేషన్ ఎందుకని మాట్లాడటం మమ్మల్ని ఎంతగానో బాధించిందన్నారు.గత గత ప్రభుత్వంలో కీలక పదవీ కొనసాగిన ఐఏఎస్ స్మిత సబర్వాల్ అధికార అహంతో ఇలా మాట్లాడటం సరికాదన్నారు.మా దివ్యాంగులకు ఉన్న హక్కులను కాల రాసే విధంగా స్మిత సబర్వాల్ మాట్లాడిన మాటలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని,ఆమె తన మాటలను భేషరతుగా వెనక్కి తీసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు.దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మిత సబర్వాల్‌పై వికలాంగుల చట్టం2016 సెక్షన్ 92 కింద కేసు నమోదు చేసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులుదోర్లగొర్ల శ్రీనివాస్,కొమురోజు సురేష్,వడ్లూరి ఈశ్వరచారిలు పాల్గొన్నారు.