ప్రగతి పట్టని..లక్ష్యం లేని బడ్జెట్‌

– బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ప్రగతి పట్టలేదనీ, దానికి ఒక లక్ష్యం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హామీల అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బడ్జెట్‌ నిండా అప్పులే కనిపించాయని ఎత్తిచూపారు. బడ్జెట్‌ ప్రసంగం రాజకీయ ప్రసంగంగా సాగిందని దెప్పిపొడిచారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 62 వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నట్టు బడ్జెట్‌లో చూపెట్టారనీ, అందులో అభివృద్ధికి ఖర్చు చేస్తున్నది కేవలం రూ.33 వేల కోట్లేనని చెప్పారు. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదన్నారు. పేద మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం, రూ.4 వేలకు పింఛన్‌ పెంపు సంగతేంటని నిలదీశారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.28 వేల కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్‌లో దానికి కోతపెట్టి రూ.22,301 కోట్లకు కుదించడమేంటని ప్రశ్నించారు. వాస్తవిక బడ్జెట్‌ రూ.2.40 లక్షల కోట్లకు మించదనీ, అంటే ప్రతిపాదించిన దాంట్లో 50 వేల కోట్ల రూపాయలు కోతపెట్టబోతున్నారని వివరించారు. కేటాయింపులు బారెడు ఖర్చు మూరెడు అన్నట్టు బడ్జెట్‌ ఉందనీ, ఇది బోగస్‌, అవాస్తవిక, అంకెల గారడీ బడ్జెట్‌ అని విమర్శించారు.