రాష్ట్ర బడ్జెట్‌లో పేదల వాటా పెంచాలి : వ్యకాస

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో పేదల వాటా మరింత పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. వ్యవసాయ కార్మికుల కోసం తీసుకొచ్చిన రైతు కూలి సంక్షేమ పథకాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు నిధులు పెంచాలనీ, నియోజకవర్గానికి 10 వేల ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ మూడెకరాల సాగుభూమి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ చట్టం బలోపేతం కోసం బడ్జెట్‌లో ఏమీ మాట్లాడకపోవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపేతం చేయడానికి అవసరమైన నిధులు కేటాయించకపోవడాన్ని తప్పుబట్టారు. రూ.3836 కోట్లతో ఏం మార్పులు చేస్తారని ప్రశ్నించారు. కేరళలో పేదలకు ఇస్తున్నట్టుగా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.