గర్శకుర్తిలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష   

The ongoing relay hunger strike in Garshakurtiనవతెలంగాణ – గంగాధర 
గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో పవర్ లూమ్స్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండవ రోజు కూడా కొనసాగింది. వస్త్ర ఉత్పత్తులు లేక స్తంభించిన పవర్ లూమ్స్ పరిశ్రమకు ప్రభుత్వం  గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు  కల్పించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వస్త్ర ఉత్పత్తులు పనులు లేక ఆగమైతున్న తమను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఏ రోజుకు ఆ రోజు పొద్దంత సాంచలు నడిపితేనే పొట్ట గడిచేదని, గత ఎనిమిది నెలలుగా పనులు లేక అల్లాడుతున్నామని ఆవేదన చెందారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తర్వాత స్థానంలో వేళ్లూనుకుని గ్రామంలో ఉన్న వర్ లూమ్స్ కలక, సాంచల సవ్వడి లేక అరిగోస పడుతున్నామని కార్మికులు వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేయగా, పనులు లేక బతుకుదెరువు కల్పించే  సాంచలు అమ్ముకుని కుటుంబ పోషణ  చేసుకోవల్సిన దుస్థితి  దాపురించిందని కార్మికులు కంటతడి పెట్టారు. ప్రభుత్వం స్పందించి గుడ్డ ఉత్పత్తి కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో వస్త్రోత్పత్తులు నిలిచిపోగా, గ్రామంలో తయారు చేసే చీరలకు మార్కెట్ లో డిమాండ్ లేదు. దీంతో పవర్ లూమ్స్ యజమానులు చేసేది లేక వస్త్ర ఉత్పత్తులు నిలిపివేయగా, సాంచలనే నమ్ముకుని జీవనోపాధి పొందే పవర్ లూమ్స్ కార్మికులు వీధిన పడి ఆందోళన చెందుతున్నారు. గ్రామ పవర్ లూమ్స్ కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం నారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దీక్షలో   పవర్ లూమ్స్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, వస్త్రోత్పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అలువాల విఠోభ, పవర్ లూమ్స్ వస్త వ్యాపారి వెంకటాద్రి సంఘీభావం ప్రకటించారు.