– ఉన్నత విద్యాభ్యాసానికి తొలగిన అడ్డంకులు
నవతెలంగాణ – వీర్నపల్లి
ఐఐటీ పాట్నాలో సీటు సాధించిన పేద విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. తన చదువు పూర్తి అయ్యే దాకా ఆర్థిక సహాయం అందించాలని సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత విద్యాభ్యాసానికి అడ్డంకులు తొలగిపోయాయి. రాజన్న సిరిసిల్ల వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన బదావత్ రాములు – సరోజ దంపతులకు ముగ్గురు కూతుర్లు. ఇద్దరు డిగ్రీ పూర్తి చేసి, వ్యవసాయ పనుల్లో సహాయ పడుతున్నారు. మూడో కూతురు మధులత జేఈఈ మెయిన్ లో ప్రతిభ చూపి ఎస్టీ కేటగిరిలో 824వ ర్యాంక్ సాధించారు. పాట్నా ఐఐటీ లో సీట్ వచ్చింది. అయితే రూ. 3 లక్షల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉంది. ఆమె ఆర్థిక ఇబ్బందులను మీడియా, వివిధ మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఓ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ విద్యార్థినిని హైదరాబాద్ పిలిపించారు. ఆమెకు చదువు పూర్తి చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు అందించనున్నారు. ఆ విద్యార్థినిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమె చదువులో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తదితరులకు మధులత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.