– బదిలీ పై వెళ్ళిన మండల పంచాయితీ అధికారి..
– అస్తవ్యస్తంగా ప్రజాపాలన..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఒక వైపు ఎడతెరిపిలేని వానలతో ఎటు చూసినా వరదలే.దీనికి తోడు ఎక్కడికక్కడ నీరు నిలిచి గ్రామాలు అంతర్గత వీధులు అన్నీ బురద మాయం కావడంతో దోమలు విజృంభిస్తున్నాయి. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బదిలీలు చేపట్టడంతో కార్యదర్శులు బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో 30 పంచాయతీలకు గాను మేజర్ పంచాయితీ అశ్వారావుపేట ఈ.ఓ సైతం బదిలీ అయ్యారు.కానీ ఆ స్థానాల్లో కొత్త కార్యదర్శులు రాకపోవడంతో పరిపాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారు అయింది.వీటన్నిటికీ తోడు పంచాయితీల్లో సాదారణ పనులు నిర్వహణకు సైతం పైసా లేకపోవడంతో ప్రత్యేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.ఇదిలా ఉంటే మండల స్థాయిలో పంచాయితీలు పర్యవేక్షించాల్సిన ఎం.పీ.ఈ.ఓ మెడికల్ లీవ్ పై ఉన్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరిలో నే సర్పంచ్ లు పాలన ముగియడంతో ప్రతీ పంచాయితీకి మండల స్థాయి అధికారులను నిమించారు.వీరు సైతం ఈ బదిలీల్లో రిలీవ్ కావడంతో పంచాయితీ ప్రజాపాలన అస్తవ్యస్థంగా ఉన్నట్లు పలువురు అధికార్లు వాపోతున్నారు. వరదలు కారణంగా చెరువులు దగ్గర నిఘా పెంచాలని,ఇసుక బస్తాలను సిద్దంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసారు.మండలంలో మొత్తం 42 చెరువులు/కుంటలను గుర్తించి వాటి సామర్ధ్యం అనుగుణంగా మించి వరదలు చేరితే సుమారు 5 వేలు పై చిలుకు ఇసుక బస్తాలను సిద్దంగా ఉంచాలని కాలీ సంచులు సరఫరా చేసారు. కార్యదర్శులు సరిపడా లేక,ప్రత్యేక అధికారులు అందుబాటులో లేక,పంచాయితీలో చిల్లి గవ్వ లేక పంచాయితీ పాలన ప్రశ్నార్ధకంగా మారిందని పలువురు వాపోతున్నారు.