అమ్మకానికి ఐడీబీఐ బ్యాంక్‌ సిద్ధం

IDBI BANK– తుది దశలో ప్రక్రియ
– హిందుస్థాన్‌ జింక్‌లోనూ డిజిన్వెస్ట్‌మెంట్‌
– వైజాగ్‌ స్టీల్‌పై వేచి చూడాలి
– దీపమ్‌ సెక్రెటరీ వెల్లడి
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ ప్రయివేటీకరణ తుది దశలో ఉందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) సెక్రెటరీ తూహిన్‌ కాంత పాండే తెలిపారు. దీనిపై అతి త్వరలోనే ప్రభుత్వం తదుపరి అడుగు వేయనుందన్నారు. ఏ సమయంలోనైనా ప్రయివేటీకరణ నిర్ణయం జరగవచ్చన్నారు. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సరైన బిడ్డర్లను ఎంపిక చేసే పనిలో ఉందన్నారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ), కేంద్రం సంయుక్తంగా ఐడీబీఐ బ్యాంక్‌లోని 61 శాతం వాటాలను ఉపసంహరించుకోనున్నాయన్నారు. ఇందులో ఎల్‌ఐసీ 30.24 శాతం, కేంద్రం 30.48 శాతం చొప్పున వాటాలను విక్రయించనున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్రానికి, ఎల్‌ఐసీకి కలిపి మొత్తం 94.72 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి నాటికి ప్రయివేటీకరణ ప్రక్రియ పూర్తి కానుందని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2023 జనవరిలోనే బ్యాంక్‌ ప్రయివేటీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల వేళ తమకు నష్టం జరగవచ్చనే అంచనాల్లో మోడీ సర్కార్‌ తాత్కాలికంగా ప్రయివేటీకరణను వాయిదా వేసింది. తాజాగా దీన్ని వేగవంతం చేయడం గమనార్హం. పీఎస్‌యూల్లో వాటాలను ప్రయివేటు శక్తులకు విక్రయించడం ద్వారా రూ.50,000 కోట్లు సమీకరించాలని 2024-25 బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రణాళికలో భాగంగానే ఐడీబీఐ బ్యాంక్‌ను అమ్మకానికి పెడుతోంది. ఐడీబీఐ బ్యాంక్‌ను చేజిక్కించుకొనేందుకు వీలున్న మదుపరులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి కావాల్సిన భద్రతాపరమైన అనుమతులు ఇటీవలే లభించాయి. ఆర్‌బీఐ నుంచి కూడా త్వరలోనే అనుమతులు వస్తాయని ఓ అధికారి తెలిపారు.హిందుస్థాన్‌ జింక్‌లోని వాటాలను కూడా విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోందని పాండే తెలిపారు. అయితే ఇది పలు చిన్న విడతల్లో జరుగుతుందన్నారు. ”హిందుస్థాన్‌ జింక్‌లో ప్రభుత్వ మైనారిటీ వాటాలను విడతల వారీగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాం. మేము మా పెట్టుబడి బ్యాంకర్ల ద్వారా మార్కెట్‌ ప్లేయర్‌లతో పరస్పర చర్చలు చేస్తున్నాము. ఇందుకోసం మరికొన్ని రోడ్‌షోలు చేపట్టవచ్చు. దీనిపై మరింత స్పష్టత వచ్చిన వెంటనే మేము ముందుకు వెళ్తాము.”అని పాండే తెలిపారు. హిందూస్థాన్‌ జింక్‌లో కేంద్రానికి ఇప్పటికీ 29.54 శాతం వాటా ఉంది. వేదాంత కంపెనీ 64.92 శాతం ఈక్విటీని కలిగి ఉంది. డిజిన్వెస్ట్‌మెంట్‌పై ప్రభుత్వ వ్యూహంలో ఎటువంటి మార్పు లేదని, మధ్యంతర బడ్జెట్‌లో వివరించిన విధంగానే కొనసాగుతుందని పాండే స్పష్టం చేశారు. పీఎస్‌యూల వాటాల విక్రయాలకు సంబంధించి సమయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు.వైజాగ్‌ స్టీల్‌కు సంబంధించిన రాష్ట్రీయా ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో డిజిన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి 2021లోనే క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని పాండే తెలిపారు. అయితే దీనిపై ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై వేచి చూడాలన్నారు. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను ముందుకు తీసుకెళ్లడానికి ముందు పరిపాలనా మంత్రిత్వ శాఖ అనేక విధానపరమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 63.75 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది.