– ఆర్టీసీ యాజమాన్యానికి ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జూనియర్ అసిస్టెంట్ (మెటీరియల్) పోస్టుల్ని మెకానికల్ సిబ్బందితో నింపాలని కోరుతూ టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) చేసిన విజ్ఞప్తిని ఆర్టీసీ యాజమాన్యం స్వీకరించి, అమల్లోకి తెచ్చినందుకు ఆ సంఘం రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలిపింది. గతంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కండక్టర్లకు మాత్రమే ఇచ్చిన సర్క్యూలర్ పైన ఎస్‌డబ్ల్యూఎఫ్ గతంలో వినతిపత్రం ఇచ్చిందనీ, డ్రైవర్లకు కూడా దానిలో అవకాశం ఇవ్వాలని కోరామని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. దానితో అప్పుడు వాటిని వాయిదా వేసిన యాజమాన్యం జూనియర్ అసిస్టెంట్ పరీక్షలకు డ్రైవర్లను కూడా అనుమతిస్తూ ఇటీవల సర్క్యూలర్ ఇచ్చిందని వివరించారు. తాజాగా జూనియర్ అసిస్టెంట్ (మెటీరియల్) పోస్టుల్లో మెకానికల్ సిబ్బందికి కూడా అవకాశం ఇవ్వాలని కోరామనీ, ఆ మేరకే ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. తమ విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకొని, ఉత్తర్వులు ఇచ్చిన యాజమాన్యానికి రాష్ట్ర కమిటీ శుక్రవారంనాడొక ప్రకటనలో ధన్య వాదాలు తెలిపింది. పరీక్షలు రాయబోయే అభ్యర్థుల కోసం ఇప్పటికే కరీంనగర్, ఖమ్మం, వనపర్తిలో ట్రైనింగ్ క్లాస్‌లు పెట్టామనీ, మిగతా ముఖ్యమైన చోట్ల కూడా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర కమిటి ఆ ప్రకటనలో పేర్కొంది. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.