– జలమయమైన పాఠశాల ప్రాంగణం
– బురదమయంగా ప్రధాన రహదారులు
నవతెలంగాణ – ఇల్లందకుంట
అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట మండల కేంద్రం వర్షం పడగానే జలమయమవుతోంది. ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రాథమిక సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.
నీట మునుగుతున్న పాఠశాల ఆవరణ
మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది. చినుకు పడగానే పాఠశాల ఆవరణ మొత్తం నీట మునిగిపోతోంది. విద్యార్థులు నిల్వ నీటిలో నడుచుకుంటూ తరగతి గదులకు చేరుకోవాల్సి వస్తోంది. ”ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు” అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బురదమయంగా రహదారులు
మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అయిన అంబేద్కర్ చౌరస్తా పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వర్షం పడగానే రోడ్లన్నీ బురదమయమవుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోనూ నీరు నిలిచిపోవడంతో ప్రజలు పనుల కోసం రావడానికి వెనుకాడుతున్నారు. ”ప్రతిసారీ వర్షం పడితే ఇదే పరిస్థితి నెలకొంటోందని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి” అని స్థానికులు కోరుతున్నారు.