రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు
నవతెలంగాణ-సిరిసిల్ల టౌన్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంద అనిల్‌, మల్లారపు ప్రశాంత్‌ విమర్శించారు. శుక్రవారం అంబేద్కర్‌ చౌక్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్‌ పత్రాలను దహనం చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఎన్నికల సమయంలో విద్యా రంగాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పార్టీ బడ్జెట్‌లో ఆరకొర నిధులు కేటాయించిందన్నారు.
రాష్ట్రం ఏర్పడిన మొదటి సారి 10 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిం చిందని, దాని తర్వాత ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుందని తెలిపారు. విద్యా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తుందని మండిపడ్డారు. ప్రస్తుత బడ్జెట్‌ యూనివర్సిటీలకు కేవలం రూ.500 కోట్లు కేటాయించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులను కేటాయించి బడ్జెట్‌ని సవరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్‌, నాయకులు చిగుర్ల అనిల్‌, రవి, తరుణ్‌, అరుణ్‌, బాలకష్ణ, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.