అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలన

Observation of mother's ideal school workనవతెలంగాణ – కమ్మర్ పల్లి 

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మండల పరిషత్ ప్రాథమిక బాలికల పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా చేసిన పనులను శనివారం ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు. పలు తరగతి గదుల్లో చేపట్టిన మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున మరమ్మతులు నిర్వహించిన గదుల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని  విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటుచేసిన మంచినీటి ట్యాంకు ఆయన పరిశీలించారు. త్రాగునీటి ట్యాంకును ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్నకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నతమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద ప్రభుత్వం నిధులు సమకూర్చి పనులు చేయించిందన్నారు.ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.