గర్భిణీ స్త్రీలకు సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్ డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు. శనివారం వేమనపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు.వరుసగా విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల వేమనపల్లి మండలంలోని లోతట్టు గ్రామాలలో నీరు చేరి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు అవుతున్న దృష్ట్యా ప్రజలకు, గర్భిణీ స్త్రీలకు వైద్యపరమైన సమస్యలు ఏవి ఎదురు కాకుండా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యల పైన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమ్యూనిటీ ఆరోగ్యాధికారి రాజారెడ్డి హెల్త్ అసిస్టెంట్ రాంశెట్టి బాపు తో కలసి రాచర్ల గ్రామానికి వెళ్లే రహదారిపై నిలిచిన నీటి ప్రవాహాన్ని అలాగే సుంపుటం జాజులపేట , ముక్కిడిగూడెం మరియు కల్లంపల్లి గ్రామాలకు వెళ్లే రహదారి పైన చేరిన నీటి ప్రవాహాన్ని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.ఆశాలు ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రతి రోజు గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహిస్తూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారికి, సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ ఆరోగ్యాధికారి రాజారెడ్డి, హెల్త్ అసిస్టెంట్ రాంశెట్టి బాపు, ఇతర హెల్త్ అసిస్టెంట్స్,ఎంఎల్హెచ్పీ, ఏఎన్ఎం లు పి.హెచ్. సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు .