అందుక్కాదట! ఇందుకట!!

శాసనసభకు రా…రా అంటే వచ్చాడు. కూసున్నడు. మాట్లాడాడు. వెళ్లిపోయాడు. నిన్న రాలేదు. ఈ వ్యాఖ్యలు ఎవరి గురించో ఇప్పటికే అర్థమై ఉంటది. తెలంగాణ ఉద్యమ నేత, మన మాజీ సీఎం కేసీఆర్‌ గురించే. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ సాధించి మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కుతాననే భ్రమల్లో ఉన్న ఆయన పార్టీ ఓటమితో ఊహించిన షాక్‌కు గురయ్యారు. కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్‌ఎస్‌, ప్రతిపక్షనేతగా కేసీఆర్‌కు కొత్త బాధ్యతలొచ్చాయి. కానీ ప్రతిపక్ష నేతగా ఆయన తొలి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. తొలి అసెంబ్లీ సమావేశాలు జరిగినన్నీ రోజులు సభకు కేసీఆర్‌ ఎందుకు రారు…రావాలి…రావాలి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఆయన రాకుండానే శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఆరునెలల తర్వాత రెండో అసెంబ్లీ సెషన్స్‌ ప్రారంభమయ్యాయి. తొలి రెండు రోజుల సమావేశాలకు కూడా కేసీఆర్‌ సభకు ఎందుకు రావడం లేదనే చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ సభ్యులు, నాయకులు కూడా సభకు రాని కేసీఆర్‌ను ఎద్దేవా చేయడం ప్రారంభించారు. ఎట్టకేలకూ కేసీఆర్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు హాజరయ్యారు. పదేండ్లలో మీడియా పాయింట్‌ మొహం చూడని కేసీఆర్‌… ఏడంతస్తుల మెట్లు దిగి మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత మొనగాడినైనా నేల చూపులు చూపించగలదు అనే దానికి కేసీఆర్‌ మీడియా పాయింట్‌కు రావడం ఒక నిదర్శనం. ఆ తర్వాత కూడా ఆయన శాసనసభ సమావేశాలు ముగిసేవరకు ప్రతీ రోజు వస్తారని భావించారంతా. కానీ మరుసటి రోజు హాజరు కాలేదు. కాంగ్రెసోళ్లు విమర్శించినందుకు అసెంబ్లీకి వచ్చారనుకున్నారంతా. కానీ ఆయన సభకు రావడానికి మరో కారణం ఉందట. కాంగ్రెసోళ్లు డిమాండ్‌ చేసినందుకు ఆయన రాలేదట. ఆయన సభకు రాకపోతే అనర్హత వేటు పడుతుందట. అందుకే ఏదో అట్లా వచ్చి ఇట్లా పోయారు. ఆయన వచ్చింది ప్రభుత్వం పిలిచినందుక్కాదట. అనర్హత వేటును రక్షించుకునేందుకట. ఇలా మీడియా పాయింట్‌లో పాత్రికేయులు గుసగుసలాడుకున్నారు.
– గుడిగ రఘు