జమ్మూ కాశ్మీర్ 370వ అధికరణం రద్దుతో అద్భుతమైన అవకాశాలు ఆవిష్కరించ బడినట్టు, అక్కడ అభివృద్ధి పరవళ్లు తొక్కుతున్నట్టు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం టముకు వేసుకుంటుంటే అక్కడ పరిస్థితులు మాత్రం వేగంగా దిగజారిపోతున్నాయి. ఆర్థిక, సామాజిక,రాజకీయ రంగాల్లో సంక్షోభం మాత్రమే గాక మానవ హక్కుల విషయంలోనూ ఈ దిగజారుడు తీవ్రమవు తుందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన చెందుతున్నారు మరోవైపున టెర్రరిస్టు కార్యకలాపాలు పెరుగుతున్నా యంటూ కేంద్రం,సైన్యం అణచివేత చర్యలు తీవ్రం చేశాయి. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ప్రత్యేకంగా ఉన్నత స్థాయిలో సమావేశమై సమీక్ష చేసి ఆగమేఘాల మీద అక్కడకు అధునాతన సైనిక దళాలను పంపించాలని నిర్ణయించారు. ఈ ఏడాది మొదట్లో కాశ్మీర్‌లో పర్యటించి అంతా గొప్పగా వుందనే ఆర్భాటం చేసిన మోడీనే స్వయంగా అత్యవసర చర్యలు ప్రకటించడంలో పరిస్థితి తీవ్రతతో పాటు కేంద్రం వ్యూహం కూడా కనిపిస్తోంది. తీవ్రవాద కార్యకలాపాలకు స్థావరాలుగా వున్న చోట్లకు సాయుధ బలగాలను మొహరించాలనీ, పహారా నిఘా కార్యక్రమాలు ముమ్మరం చేయాలనీ ఆదేశించారట. మొత్తంపైన 500 మంది కమెండోలు, 2000 మేరకు ఇతర దళాలు ఈ ప్రత్యేక చర్యలో పాల్గొంటున్నట్టు సమాచారం. భద్రతా దళాలు రాష్ట్ర పోలీసులు కలిసి గాలింపు చర్యలు ఇప్పటికే బాగా పెంచేశారు. అనుమానితులను విస్తారంగా అరెస్టులు చేస్తున్నారు. తీవ్రవాద కార్యకలాపాలను కాశ్మీర్ లోయ నుంచి జమ్మూ ప్రాంతంలోకి విస్తరించడం జరుగుతోందని కేంద్రం చెబుతున్నది. రాజకీయంగా జమ్మూలో బీజేపీ కేంద్రీకరణ, స్థానాలు తెచ్చుకోవడం తెలిసిన విషయమే. గతేడాది ఏకపక్షంగా నియోజకవర్గాల పునర్విభజన జరిపినప్పుడు కూడా జమ్మూలోనే సీట్లు పెరగడం విమర్శకు కారణమైంది, బీజేపీ మతతత్వ విభజన రాజకీయాలు దీనికి ఒక కారణమైతే రిజర్వేషన్ విధానం వల్ల గుజ్జార్లలో ఒక భాగం దూరం కావడం, గతంలో ఆఫ్ఘనిస్తాన్‌ను స్థావరంగా చేసుకున్న కొందరు తీవ్రవాదులు ఇటు మరలిరావడం వంటి ఇతర కారణాలుగా కూడా చెబుతున్నారు.
జమ్మూలో పరిణామాలు
ఏమైనా ఇదేదో ఊహించని పరిణామం కాదు. కేంద్రం కాశ్మీర్ పట్ల అనుసరించిన అప్రజాస్వామిక విధానాలే పరిస్థితి దిగజారడానికి అసలు కారణమయ్యాయి. తీవ్రవాదాన్ని అణచివేసే పేరిట పౌర హక్కులపై దాడి చేయడం నిరసన పెంచుతున్నది. ఉదాహరణకు పూంచ్ జిల్లాలోనే సైనిక దళాలు ముగ్గురు పౌరులను అనుమానంపై నిర్బంధించడం, లాకప్‌లోనే వారు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర నిరసనకు దారితీసింది.ప్రధాని మోడీ పర్యటనకు ముందు కూడా అందరినీ అరెస్టు చేశారు. ఈ నిరంకుశ ధోరణి ఎంతవరకూ పోయిందంటే దశాబ్దాలుగా కాశ్మీరీలు ప్రత్యేకంగా నిర్వహించుకునే అమరవీరుల సంస్మరణ దినానికి కూడా అనుమతి నివ్వలేదు. టెర్రరిజం పెరగడానికి కారణమైన పాలకులే దాన్ని సాకుగా చూపి పౌరుల, పార్టీల హక్కులను అణచి వేస్తున్నారన్న మాట. సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు మహ్మద్ యూసఫ్ తరిగామి జమ్మూ కాశ్మీర్ పరిస్థితి దిగజారడానికి కారణాలేమిటో స్పష్టంగా తెలియజేశారు. అయిదేండ్ల నుంచి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలు లేకుండా పోవడమే ఇందుకు కారణమవుతోందన్నారు. ”వివిధ రంగాల్లో తీవ్ర సంక్షోభానికిది దారితీసింది. గతంకన్నా ధరలు నిరుద్యోగం దారుణంగా పెరిగిపోవడమే గాక దారిద్య్రం అప్పుల భారం తాండవిస్తున్నాయి. కాశ్మీర్‌లోయలో ఈ సమస్యలు రగులుతుంటే కేంద్రం మీడియా కూడా జమ్మూలో తీవ్రవాదం పెరుగుదల గురించి ఎక్కువగా మాట్లాడటం యాదృచ్చికం కాదు.గతంలోనూ వారి వ్యూహం అక్కడే కేంద్రీకృతమై వుంటోంది.” కాశ్మీరీ పండిట్లపై హత్యలు అనేదాన్ని దేశ వ్యాపితంగా ఒక మతపరమైన కోణంలో చూపించడం అందులో భాగమే. వారికోసం గట్టిగా నిలబడి ప్రాణాలమీదకు తెచ్చుకున్నవారిలో తరిగామి ముందున్నారు. అనేక దాడులను తట్టుకుని నిలబడినందుకే ఆయన జమ్మూ నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే కాగలిగారు.
తలకిందులు వాదనతో…
రెండవసారి అధికారానికి వచ్చీ రాగానే మోడీ సర్కారు 370ని ఏకపక్షంగా రద్దు చేసింది. అంతేగాక కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. లడక్‌ను ప్రత్యేక ప్రాంతంగా విభజించింది. రాజ్యాంగ రీత్యా ఒక రాష్ట్ర విభజన హోదా మార్పు శాసనసభకు చెప్పిచేయాలి. అందులోనూ కాశ్మీర్ శాసనసభకు ప్రత్యేక ప్రతిపత్తి కూడా వుండింది. ఆ శాసనసభ ఉనికిలో లేనప్పుడు రాష్ట్రపతి పాలనలో భాగంగా గవర్నర్ రాజ్యం చేస్తున్నప్పుడు నిరంకుశంగా ఇవన్నీ కానిచ్చేశారు. మాజీ ముఖ్యమంత్రులతో సహా కీలక నేతలందరినీ జైళ్లపాలు చేసి గవర్నర్ చాటున బీజేపీ అనుకూల మతతత్వ పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.370 స్పూర్తిని సవ్యంగా అమలు చేయకుండా కేంద్రం పెత్తనం చేయడం కాశ్మీర్ సమస్యలకు మూలం. అందుకు పూర్తి విరుద్ధంగా కాశ్మీర్ వెనకబాటుకు 370 కారణమని దుష్ప్రచారం చేశారు. 370 వల్ల కేంద్ర పథకాలు అమలు చేయడం సాధ్యపడటం లేదన్నారు. బయటవారు కాశ్మీర్‌లో వచ్చి వ్యాపారాలు, అస్తుల కొనుగోళ్లు చేయడానికి వీలుపడటం లేదన్నారు. పెట్టుబడులు రాకపోవడానికి అదే కారణంగా చూపించారు.దాన్ని రద్దుచేసిన అయిదేళ్ల తర్వాత ఇప్పుడు పరిస్థితి ఇంతగా దిగజారడం చూస్తే ఆ ప్రచారాలన్నీ కట్టుకథలని తేలిపోతుంది. ఎందుకంటే 370 వున్నా కేంద్ర పథకాలు అమలు చేయడానికి ఏ ఆటంకం వుండేది కాదు. గ్రామీణ ఉపాధి పథకం. ప్రధాని గ్రామీణసడక్ యోజన వంటివి అక్కడ అమలవుతుండేవి. ఇక బయట వారి పెట్టుబడులకు అది అడ్డంకిగా వుండేదన్న మాట కూడా నిజం కాదు. ఎన్నో దశాబ్దాలుగా కథువాలో బిర్లాల మిల్లు, శ్రీనగర్‌లో గ్రాండ్ లలిత్ హోటల్ వంటివి వుంటూనే వచ్చాయి.కేవలం కాశ్మీర్‌పై పూర్తి ఆధిపత్యం పెంచుకోవడానికి నేరుగా కేంద్రం పెత్తనంతో బీజేపీ బలం పెంచుకోవడానికి మాత్రమే ఈ నాటకం నడిపించారు.
శాసనసభ ఎన్నికలెప్పుడు?
కేంద్రం పెత్తనంలోకి వచ్చాక అన్నిటికన్నా తీవ్రమైన దెబ్బ తగిలింది మానవ హక్కులకే. కాశ్మీరియత్ అనే స్థానిక సంస్కృతిని, రాజ్యాంగంలో హామీ ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేయడం ప్రజలలో నిరసన పెంచింది.అంతకుముందు అనేక మంది టెర్రరిజానికి వ్యతిరేకంగా మారారు. కానీ ఈ అసంతృప్తిని పెంచిన మోడీ సర్కారు చర్యలు, లెఫ్టినెంట్ గవర్నర్ నిరంకుశ పోకడలు మరోసారి విచ్చిన్న శక్తుల కుట్రలకు దేశ వ్యతిరేక శక్తులకు ఊతమిస్తున్నాయి.ఈ తప్పులను సరిదిద్దుకుని ప్రజలనూ పార్టీలనూ విశ్వాసంలోకి తీసుకునే బదులు కేవలం సాయుధ బలగాలు అణచివేత చర్యలను పెంచడం పరస్థితిని మరింత దిగజార్చుతున్నది. ఏ మాత్రం సందేహానికి గురైనా సామాన్య పౌరులను నిఘా వర్గాలు వెంటాడుతున్నాయి. డిజిటల్ నిఘా పరాకాష్టకు చేరింది.పోలీసులు సాయుధ దళాల బెదిరింపులు నిత్యకృత్యమయ్యాయి.మామూలు ప్రజల నుంచి మొబైల్ ఫోన్‌నెంబర్లు తీసుకోవడం రివాజుగా మారింది. సుదీర్ఘకాలం పాటు ఇంటర్నెట్ సౌకర్యంతో సహా సమాచార సంబంధాలు లేకుండా పోయాయి. ఎవరు ఏ కాస్త భిన్నస్వరం వినిపించినా, విమర్శ చేసినా నిర్బంధం చుట్టుముడుతున్నది. ఎన్నికైన ప్రభుత్వం రాజకీయ కార్యకలాపాలు లేకపోవడంతో నిరంకుశాధికార వర్గం రాజ్యం చేస్తున్నది.వీరిపై ఎలాటి ఆజమాయిషీ గానీ, అదుపాజ్ఞలు గానీ లేకుండా పోయాయి.ఈ అంశాలు పార్లమెంటులోనూ, సుప్రీం కోర్టుముందు కూడా చర్చకు వచ్చాయి. 370 రద్దును సవాలు చేసే రాజ్యాంగ కేసును విపరీతంగా ఆలస్యం చేసిన సుప్రీం కోర్టు ఆఖరుగా అది చెల్లుతుందని తీర్పునివ్వడం నిరుత్సాహపర్చింది. అయితే అదే సమయంలో సెప్టెంబరు 30 లోగా అక్కడ ఎన్నికలు జరిపి శాసనసభను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రతిపక్షాల నిరసన
కాశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి సంఘాలకు జరిగిన ఎన్నికల్లో గుప్కార్ అలయన్స్ ఆధిక్యత సాధించగా బీజేపీ జమ్మూలో ప్రభావం చూపించింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనైతే జమ్మూలోని ఉద్దంపూర్, జమ్మూ స్థానాలు బీజేపీ గెల్చుకోగా, శ్రీనగర్, అనంతనాగ్ రాజౌరి నేషనల్ కాన్ఫరెన్స్ తెచ్చుకుంది. కాశ్మీర్ లోయలోని బారాముల్లా స్థానం నుంచి పిడిపిపై నేషనల్ కాన్ఫరెన్స్ తరపున ఒమర్ అబ్దుల్లా విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా వేర్పాటువాద అవామీ ఇత్తేహాద్ పార్టీ అభ్యర్థి, పూర్వపు ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ ఇంజనీర్ స్వతంత్రుడుగా విజయం సాధించారు. ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న ఆయన ప్రత్యేకంగా కోర్టు ద్వారా వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం మీడియాను ఆకర్షించింది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ప్రకారం చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ 36చోట్ల, బీజేపీ 29 చోట్ల ఆధిక్యతలో వుండగా మొహబూబా మఫ్తి పిడిపిి కేవలం అయిదు చోట్ల, కాంగ్రెస్ ఏడు చోట్ల మాత్రమే ఆధిక్యత తెచ్చుకో గలిగాయి. కాంగ్రెస్, ఎన్‌సి ‘ఇండియా’లో ఉన్నా ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేశాయి. ఈ రాజకీయ ఫలితాల ప్రభావం కూడా కేంద్ర బీజేపీ చర్యలను ప్రభావితం చేస్తున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు ఆదేశించినా ఏదో ఒకసాకుతో వాయిదా వేస్తూ వస్తోంది. పైగా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనాధి కారాలు, నియామక అధికారాలు మరింత పెంచుతూ కొద్దిరోజుల కిందట హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.శాసనసభ ఏర్పాటు కావలసిన తరుణంలో ఈ విధంగా చేయడ మంటే రేపు రాబోయే ప్రభుత్వ అధికారాలను ముందుగా కత్తిరించడమే. పారిశ్రామిక విధానాన్ని సవరించి మరింత సులభంగా భూములు వాణిజ్యసంస్థలకు కేటాయించేందుకు గవర్నర్ యంత్రాంగం నిన్ననే తాజా ఉత్తర్వులు ఇచ్చింది. టెర్రరిజం అణచివేత పేరిట సైనిక దళాల చర్యలు,రాజకీయంగా గవర్నర్ అధికారాలు పెంపు, కార్పొరేట్లకు నజరానాల పెంపు,మతపరమైన విభజన తీవ్రం చేయడం ఈ సమయంలో కేంద్ర బీజేపీ వ్యూహంగా ఉంది.ఒక విధంగా ఇది జరగాల్సిన దానికి పూర్తి భిన్నమైన దిశలో ఉందని చెప్పాలి. జమ్మూకాశ్మీర్ ప్రతిపక్ష పార్టీలు ఈ ఏకపక్ష నిర్ణయాల విషయమై చర్చించేందుకు ఆగష్టు7న సమావేశమవుతున్నాయి. ఈలోగా కేంద్ర ఫ్రభుత్వం, బీజేపీ నాయకత్వం ఏం చేస్తాయో చూడవలసి వుంటుంది.
– తెలకపల్లి రవి