ఆస్కార్‌ గెలుచుకున్న ఎకైక హారర్‌ చిత్రం

ఆస్కార్‌ గెలుచుకున్న ఎకైక హారర్‌ చిత్రంహాలీవుడ్‌ హారర్‌ సినిమాలకు ప్రపంచంలో ఎందరో అభిమానులున్నారు. వారిలో ఇటువంటి సినిమాలపై ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా ప్రపంచంలోనే హారర్‌ సినిమాల దిశను మార్చినది ‘ది సైలంస్‌ ఆఫ్‌ ది ఆంబ్స్‌’ అని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు. ఆ తరువాత ఎన్నో హారర్‌ సినిమాలు వచ్చినా ఈ సినిమాకున్న ప్రత్యేకతను అవి దాటలేకపోయాయి. అప్పటి దాకా హంతకులు, క్రిమినల్స్‌ని బలహీన మనస్కులుగా దుర్మార్గులుగా మాత్రమే చూసిన ప్రేక్షకులకు విపరీతమైన తెలివితో, అందరినీ ఆకర్షించే మంచి నడవడిక గల లెక్టర్‌ని హంతకుడిగా చూడడం ఓ వింత అనుభవం. ఇలాంటి హంతకుడిని తెరపై ఆవిష్కరించడంతో హారర్‌ సినిమాలలోనే ఓ కొత్త ట్రెండ్‌ మొదలయిందని చెప్పవచ్చు. ఇక మహిళను ఓ ఉన్నతమైన పోలీస్‌ ఆఫీసరుగా చూపించడం ఈ సినిమాతోనే మొదలయింది. అందువల్ల ఇది మొదటి ఫిమినిస్ట్‌ థ్రిల్లర్‌గా విశేష ఆదరణను పొందింది. ఇక దీని స్క్రీన్‌ ప్లే, సంగీతం సినిమాను ఆసాంతం ఆసక్తిగా చూడడానికి సహాయపడితే, థ్రిల్లర్‌ సినిమాలలో మానవ మేధో విశ్లేషణను సైద్దాంతికంగా చర్చకు పెట్టిన చిత్రంగా ఇది రికార్డు సష్టించింది.
ఆస్కార్‌ చరిత్రలోనే ముఖ్యమైన ఐదు విభాగాల్లో (నటుడు, నటి, దర్శకుడు, చలనచిత్రం, స్క్రీన్‌ప్లే) బహుమతి గెలుచుకున్న చిత్రాలు మూడు మాత్రమే. అందులో ఒకటి ‘ది సైలెంస్‌ ఆఫ్‌ ది లాంబ్స్‌’. మనిషి మెదడులో అట్టడుగున ఎన్నో పొరలుంటాయని, వాటి రహస్యాలను తెలుసుకోవడం కష్టమని, అతి మంచి గుణాలున్న వారిలో కనిపించని క్రూరత్వం కూడా దాగుంటుందని, మానవ మేధస్సు మహా క్లిష్టమైనదని చర్చించిన చిత్రం ఇది. కాబట్టి దీన్ని కేవలం మామూలు హారర్‌ చిత్రంగా చూడలేం. ఒక హంతకుడిని అబ్బురంగా చూపించిన చిత్రం కూడా ఇదే.
డా|| హానీబల్‌ లెక్టర్‌ ఓ పెద్ద సైక్రియాటిస్ట్‌. అలాగే మానవ దేహాలను తినే ఓ హంతకుడు. అతను జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అలాంటి క్రూరుడు కూడా ఎప్పుడూ శుభ్రంగా తెలివిగా కనిపిస్తూ, జైలులోనూ క్రమబద్దమైన జీవితం గడుపుతూ ఉంటాడు. మేధను పదును పెట్టుకునే పుస్తకాలు చదువుతూ ఉంటాడు. అతనితో చేసే సంభాషణ ఎన్నో విషయాల పట్ల అవగాహన కలిగేలా ఉంటుంది. అతన్ని గౌరవించకుండా ఉండలేం. అంతటి మేధావిలో దాక్కున్న రాక్షసుడిని భరించడం అసాధ్యం. పోలీసులకు ఒకే పద్ధతిలో జరుగుతున్న కొన్ని హత్యలు తలనొప్పిగా మారతాయి. హంతకుడు స్త్రీలను దారుణంగా హత్య చేసి, వారి శరీరాన్ని ఒలిచి శవాలను పడేసి వెళుతుంటాడు. అతన్ని పోలీసులు బఫలో బిల్‌ అని పిలుస్తుంటారు. అతన్ని పట్టుకోవడం వారికి సవాలుగా మారుతుంది. దీనికి లెక్టర్‌ సహాయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే లెక్టర్‌ ఎవరితోనూ సంభాషించే వ్యక్తి కాదు. అతనితో మాట్లాడకపోతే ఈ వరుస హత్యలను ఆపడం కష్టం. అందుకని జాక్‌ క్రాఫోర్డ్‌ అనే ఓ ఆఫీసర్‌ తమ దగ్గర ట్రైనింగ్‌లో ఉన్న చురుకైన మహిళా స్టూడెంట్‌ సహాయం కోరతాడు. ఆమె క్లారిస్‌ స్టారింగ్‌.
క్లారిస్‌ తెలివైనదీ, పట్టుదల కలది. ఎందరో పురుష ఆఫీసర్లను మించిన సమయస్పూర్తిని ఆమె ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆమెను లెక్టర్‌ కలుస్తాడు. ఆమెలోని తెలివి అతనికి నచ్చుతుంది. ముందు ఆమెకు సహాయం చేయనని తనలోని రాక్షసుడిని ఆమెకు కాస్త చూపించి భయపెడతాడు. అక్కడి నుండి వెళ్ళిపోతున్న క్లారిస్‌ను అదే బారక్‌లో ఉన్న మరో ఖైదీ అవమానిస్తాడు. ఇది లెక్టర్‌ సహించలేకపోతాడు. ఆమెను పిలిచి ఆమెకు కావల్సిన కాస్త సమాచారం ఇస్తాడు.
బిల్‌ ఓ మతి స్థిమితం లేని ఓ వ్యక్తి అని లెక్టర్‌ ద్వారా తెలుస్తుంది. కాని అతను క్రూరుడని కూడా అర్ధం చేసుకుంటుంది పోలీస్‌ యంత్రాంగం. లెక్టర్‌ ఇచ్చిన ఆధారాలను పట్టుకుని అతను చెప్పిన చోటుకు క్లారెస్‌ వెళుతుంది. అక్కడ ఓ మనిషి తల ఆమెకు దొరుకుతుంది. తాము వెతుకుతున్నది మామూలు హంతకుడు కాదని, అతను అతి క్రూరుడని ఆమె నిర్ధానించుకుంటుంది. క్లారెస్‌ను అవమానించిన ఖైదీ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తాడు లెక్టర్‌. అతనికి క్లారెస్‌పై కుదిరిన నమ్మకం, ఆమెను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని హత్య చేసేలా చేస్తుంది. అతను ఆ ఖైదీ, మెదడుతో ఆడుకుని అతనే స్వయంగా అత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తాడు. అవతలి మనిషిని, అతని మెదడుని ఓ గొప్ప సైకియాట్రిస్ట్‌గా లెక్టర్‌ నియంత్రించడం పోలీస్‌ యంత్రాంగాన్ని షాక్‌కు గురి చేస్తుంది.
ఈ లోగా బిల్‌ మరో అమ్మాయిని కిడ్నాప్‌ చేసి హత్య చేస్తాడు. ఆమె శవానికి పోస్ట్‌ మార్టం నిర్వహిస్తున్నప్పుడు ఆమె గొంతులో అతి విచిత్రమైన గొంగళిపురుగుని బైటికి తీస్తారు వైద్యులు. హంతకుడు ఈ పురుగులతో ఓ సందేశాన్నిస్తున్నాడని అనిపిస్తుంది వారికి.
మరో అమ్మాయి కిడ్నాప్‌కు గురవుతుంది. ఈమె తల్లి ఓ పెద్ద రాజకీయ నాయకురాలు. ఆమె స్వయంగా లెక్టర్‌ను సహాయం చేయమని అడగాలనుకుంటుంది. అందుకని పోలీసు యంత్రాంగం చాలా జాగ్రత్తలు తీసుకుని ఓ పెద్ద ఇనప బంధిఖానాలో లెక్టర్‌ను ఉంచి జైలు నుండి బైటకు తీసుకువస్తుంది. అక్కడ మళ్ళీ క్లారిస్‌ అతన్ని కలుస్తుంది. అక్కడ క్లారిస్‌ లాంటి ధైర్యవంతురాలి మనసులో నిక్షిప్తంగా దాక్కున్న భయాన్ని ఆమె బాల్య స్మృతులను బైటకు తీస్తాడు లెక్టర్‌. చిన్నతనంలో బంధువుల ఇంట్లో గొర్రెలను ఒకొక్కటిగా ఆమె కళ్ళ ముందు చంపుతున్నప్పుడు వాటిలో ఒక్క గొర్రెనయినా రక్షించాలని ఆమె పడిన తాపత్రయం ఆమె వ్యక్తిత్వంలో భాగం అయిపోయిందని, ఇప్పుడు కిడ్నాప్‌కు గురయిన అమ్మాయిని ఆ రక్షించబోయె గొర్రగా అమె మనసు చూస్తుందని అందుకే విపరీతంగా అ ఆమ్మాయి కోసం ఆమె ఆలోచిస్తుందని, ఆమె పోలీసు ఉద్యోగం ఎన్నుకోవడానికి, ఇతరుల కన్నా ఎక్కువగా ప్రతి కేసుకి ఆమె కష్టపడడంలో ఆ చిన్ననాటి జ్ఞాపకం కారణమని, ఎంతో ధైర్యంగా పైకి కనిపించే ఆమెలో ఓ బేల ఉందని అదే బేలతనం, అమెను ముందుకు నడిపిస్తుందని లెక్టర్‌ వివరించడంతో ఆశ్చర్యపోతుంది క్లారిస్‌. మనిషిని చూసిన వెంటనే వారి మనసులోతుల్లోకి వెళ్ళగల లెక్టర్‌ మేధావితనం ఆమెను ఆశ్చర్యపరుస్తుంది. పైగా తనలోని ఆ బేలతనాన్ని అంగీకరిస్తుంది కూడా.
క్లారిస్‌తో అంత గొప్పగా మాట్లాడిన ఆ మేధావి మరు నిముషం కిరాతకంగా ఇద్దరు పోలీసులను చంపి అక్కడి నుండి తప్పించుకుంటాడు. క్లారిస్‌ లెక్టర్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా బిల్‌ చంపిన మొదటి స్త్రీ అతని పరిచయస్తురాలని అర్ధం చేసుకుంటుంది. ఆమె బిల్‌ సొంత ఊరుకి వెళ్లి అతని గురించి వాకబు చేస్తుంది. ఇక తరువాత అసలు హంతకుడిని చంపి కిడ్నాప్‌ అయిన మినిస్టర్‌ కూతురుని రక్షిస్తుంది.
బిల్‌ పురుష శరీరంలో స్త్రీ మనసు ఉన్న వ్యక్తి. అంటే ఒక ట్రాన్స్‌ సెక్సువల్‌. సెక్స్‌ మార్పిడి ఆపరేషన్‌ అతనికి కుదరదు. స్త్రీగా మారాలన్న అతని కోరిక అతన్ని ఉన్మాద స్థితికి తీసుకెళుతుంది. కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయిలను వెతికి పట్టుకుని వారిని బంధించి, కొన్నాళ్ళు తిండి పెట్టకుండా మాడ్చి, హత్య చేసి వారి చర్మాన్ని ఒలిచి దానితో ఓ డ్రెస్‌ కుట్టుకుంటూ ఉంటాడు. అది తొడుక్కుని స్త్రీగా అనుభూతి చెందాలన్న ఉన్మాదం అతనిది. అతను హత్య చేసిన మొదటి స్త్రీ అతని తోటి దర్జీ. ఆమె ఇంటికి వెళ్లిన క్లారెస్‌ అక్కడి నుండి తన విచారణ మొదలుపెట్టి చివరకు అసలు హంతకుడిని పట్టుకుంటుంది. చక్కని స్క్రీన్‌ప్లేతో ఈ సన్నివేశాలను నిర్మించారు దర్శకులు. అందుకని క్లారిస్‌ అనుభవించే ఆ టెన్షన్‌ను ప్రేక్షకులూ ఆసాంతం అనుభవిస్తారు.
అయితే ఈ సినిమా ముగింపు కొందరు ఎల్‌.జి.బి.టి కార్యకర్తలకు నచ్చలేదు. ఒక ట్రాన్స్‌సెక్సువల్‌ను ఉన్మాదుడిగా చూపించిన విధానం పట్ల కొంతమంది నిరసన ప్రకటించారు. చివరకు కేసుని చేధించినందుకు క్లారెస్‌ అభినందన సభలో ఉండగా ఆమెకు లెక్టర్‌ ఫోన్‌ చేసి తాను ఆమెకు చేసిన సహాయానికి ఆమె తనను మర్చిపోవాలని కోరతాడు. తాను ఆ పని చేయలేనని ఓ పోలీస్‌ అధికారిగా ఆమె జవాబిస్తుంది. చిరునవ్వుతో లెక్టర్‌ నేను భోజనానికి వెళ్లాలి అంటూ జనంలో కలిసిపోతాడు. మనుషుల శరీర భాగాలను తినే అతను మరో హత్యకు వ్యూహం పన్నుతున్నాడని క్లారెస్‌కు అర్ధమయినా ఏం చేయలేని నిస్సహాయతతో మౌనంగా ఉండిపోవడం చిత్ర ముగింపు.
ఈ సినిమా 1988లో వచ్చిన థామస్‌ హారిస్‌ నవల ఆధారంగా తీశారు. క్లారెస్‌గా జోడీ ఫోస్టర్‌ అతి గొప్ప నటనను ప్రదర్శించారు. ఆమె శరీర భాష ఎఫ్‌.బి.ఐ ఆఫీసర్‌గా ఆమె చూపే ఆ హుందాతనం, పరిణతి స్త్రీ పోలీసు పాత్రలకు ఓ ట్రేడ్‌మార్క్‌గా నిలిచిపోయాయి. ఆ తరువాత ఇటువంటి పాత్రలు చేసిన నటులందరూ ఆమెను అనుకరించాలని ప్రయత్నించినవారే. అప్పటిదాకా థ్రిల్లర్‌ సినిమాలలో స్త్రీలు అలంకార వస్తువులు మాత్రమే. అతి చిన్న దుస్తులతో వ్యక్తిత్వం లేని చిల్లరతనంలో తుపాకి పట్టుకుని ఆ సినిమా హీరోల హీరోయిజానికి తోడ్పడేవారు తప్ప ఏ మాత్రం హుందాతనం చూపే అవకాశం లేకపోయేది. కాని ఇందులో క్లారిస్‌ గ్లామర్‌కు దూరంగా ఉంటూనే ఎంతో హుందాగా కనిపిస్తుంది. తన భారీ ఆకుపచ్చ కోటు, ప్యాంటు, సున్నితమైన బ్రౌన్‌ లేస్‌-అప్‌లలో ఆమె ఆకర్షణకు ఆమడ దూరంలో పక్కా ప్రొఫెషనలిజంతో కనిపిస్తుంది. ఆ దుస్తుల నుంచి కాకుండా ఆమె అభినయించే ఆ హుందాతనం ఆమెకు ఆకర్షణగా నిలుస్తుంది. ఓ పురుష పాత్రలో ఉన్న మహిళగా ఆమెని చూస్తున్న వారికి ఆమె హుందాతనం ఆకర్షిస్తుంది. సినీ నాయికల స్థాయి మార్చిన నటతో జోడీ ఫోస్టర్‌ ఎప్పటికీ గుర్తుండుపోతారు. ఈ సినిమాలో ఆమే హీరో. సినిమా చూస్తున్నంత సేపూ మరే హీరో మనకు గుర్తురాడు. అసలు హీరో అంటే పురుషుడు కదా అని కూడా అనిపించదు. పైగా ఎక్కడా అతి హీరోయిజం ఆమె ప్రదర్శించదు. ఓ పోలీస్‌ ఆఫీసర్‌గా ఎక్కడా నియమాలు అతిక్రమించకుండా తన పని చేసుకుంటూ వెళుతుంది. ఈ సినిమా ఎఫ్‌.బి.ఐ.లో స్త్రీలను తీసుకోవచ్చని నిరూపించిందని అమెరికాలోని ఎఫ్‌.బి.ఐ. సంస్థే వ్యాఖ్యానించిందంటే క్లారిస్‌ పాత్ర ఎంతటి మార్పుకు పునాదిగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.
చాలా సీన్లలో క్లారిస్‌ నడుచుకుంటూ వెళుతుంటే ఆమెను ఎన్నో రకాల భావాలతో పురుషులు చూస్తూ ఉంటారు. ఎవరినీ పట్టించుకోని, దేన్నీ లెక్కచేయని క్లారిస్‌ ఆధునిక స్త్రీ వ్యక్తిత్వానికి ప్రతీక. ఆమె కళ్ళల్లో కనిపించే ఆ ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ప్రతి సీన్‌లో ఆమె చూట్టూ ఉన్న పురుషుల మధ్య ఆకారంలో చిన్నగా వున్నా కానీ, ఆత్మవిశ్వాసంలో ఉన్నతంగా కనిపించే ఆమెను మరచిపోలేం.
ఇక హానిబల్‌ లెక్టర్‌ పాత్రలో ఆంథోని హాప్కిన్స్‌ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ పాత్రకు ఆయన ఎంత గొప్పగా సరిపోయారంటే, హాలీవుడ్‌ సినిమాలలో విలన్‌ అంటే హానిబల్‌ లెక్టర్‌ అనే విధంగా కొన్ని తరాలను ప్రభావితం చేశారు. ఆ పాత్రను ప్రేమిస్తాం, ద్వేషిస్తాం, భయపడతాం. ఇలా అన్ని భావాలను ఒకే పాత్ర ఒకే సందర్భంలో రాబట్టడం చాలా అరుదు. లెక్టర్‌ పాత్రతో ఇది సాధించి నటనకే కొత్త భాష్యం చెప్పిన గొప్ప నటులు ఆంథోని హాప్కిస్స్‌. మొత్తం సినిమాలో అతను కేవలం 24 నిముషాలు మాత్రమే స్క్రీన్‌ పై కనిపిస్తాడు. కాని ప్రేక్షకులు అతని ఉనికిని చివరిదాకా ప్రతి సీన్‌లో అనుభవిస్తారు.
ఈ సినిమా తరువాత ఇదే పాత్రలతో రెండు సీక్వెల్స్‌ వచ్చినా అవి ‘ది సైలెంస్‌ ఆఫ్‌ ది లాంబ్స్‌’ లా అకట్టుకోలేకపోయాయి. అందులో లెక్టర్‌ పాత్రను ఆంథోని హాప్కిన్స్‌ పోషించినా, క్లారెస్‌ పాత్రలో జోడీ ఫాస్టర్‌ స్థాయిలో మరెవ్వరూ నటించలేకపోయారు. ఇక ఈ సినిమాలో ప్రతి సీన్‌లో ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ వెళ్ళిన దర్శకుడు జోనాధన్‌ డెమ్మి స్థాయిలో సీక్వెల్‌కు న్యాయం జరగలేదన్నది నిజం. నవల కన్నా సినిమా బావుందనిపించే సందర్భాలు పుస్తక ప్రియులకు సినీరంగంలో చాలా తక్కువ. కాని ఈ సినిమా నిస్సందేహంగా నవల స్థాయిని పెంచిందని చెప్పవచ్చు. దానికి దర్శకత్వ ప్రతిభ కారణం అన్నది విస్మరించలేని సత్యం.
– పి.జ్యోతి,
98853 84740