కల్వల ప్రాజెక్టు కట్ట మరోమారు తెగిపోయి రైతాంగం ఆందోళనకు గురవుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా నీరు చేరడంతో కట్టలో కొంత భాగం కొట్టుకుపోయింది.గతేడాది జూలై 27న కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. అప్పుడు పంటలను రక్షించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వానాకాలం, యాసంగి సీజన్లలో పంటలకు నీరందించారు. అయితే ఈసారి మళ్లీ భారీ ప్రవాహంతో కట్ట తెగిపోయింది. 1969-70లో నిర్మించిన ఈ ప్రాజెక్టు శంకరపట్నం, వీనవంక మండలాల్లోని 3,000 ఎకరాలకు పైగా భూములకు ప్రత్యక్ష నీటి వనరుగా ఉంది. మరో 1,500 ఎకరాలు కూడా మోటార్లతో ప్రాజెక్టు నీటిని తోడి సాగవుతున్నాయి. కొంతమంది రైతులు భారీ ఖర్చుతో సుమారు 1,000 మీటర్ల పైపులైన్ వేసి మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. 0.25 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు కట్ట తెగిన కొద్ది గంటల్లోనే ఖాళీ అయిపోయింది. ప్రాజెక్టుకు దిగువన నాటిన వరి పంట పూర్తిగా కొట్టుకుపోగా, ఆయకట్టులోని పంటలు నీటి కొరతతో ఇబ్బంది పడనున్నాయి. మాజీ సర్పంచ్ దాసరపు బద్రయ్య మాట్లాడుతూ, గతేడాది రూ.9 లక్షలు ఖర్చు పెట్టి రింగ్ బండ్లు నిర్మించి తాత్కాలిక మరమ్మతులు చేశాం. కానీ కట్ట బలంగా లేకపోవడంతో మళ్లీ తెగిపోయింది. ప్రాజెక్టు కింద పంటల సాగు దాదాపు పూర్తయింది. ఇప్పుడు పంటల భవిష్యత్తు అనిశ్చితంగా మారింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టను మరమ్మతు చేసి పంటలను కాపాడేందుకు జిల్లా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.