
మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం గ్రామానికి చెందిన వడ్రంగి వృత్తిదారుడు కొండపర్తి బత్కయ్య ఇల్లు ఆదివారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ షాట్ సర్క్యూట్ తో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ద్విచక్రవాహనం, కలపకోత మిషన్, వస్తువులు తయారు చేసేందుకు తెచ్చిన కలప పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా బత్కయ్య కూతురు వివాహం ఆగస్టు 18న ఉండగా పెండ్లి సామానులు కొనుగోలు చేసేందుకు ఆదివారం కుటుంబ సభ్యులంతా మంచిర్యాల జిల్లా చెన్నూరు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.కూతురి వివాహం కోసం తీసుకువచ్చి సామగ్రి సైతం కాలి బూడిదైందని, సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని అఖిలభారత విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి అందె భాస్కరాచారి కోరారు.