మండలంలోని చౌట్ పల్లిలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలలో అవగాహన కల్పిస్తూ వైద్య సిబ్బంది చేస్తున్న ఆరోగ్య సర్వేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుప్రియ మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలు నివాస గృహాలను సందర్శించిన ఆమె ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా మొదలగునవి వ్యాపిస్తాయని తెలిపారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి శుక్రవారం రోజు ఫ్రైడే గా పాటించాలని సూచించారు. వాడిన కూలర్లను శుభ్రం చేసుకోవాలని, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తద్వారా దోమలను అరికట్ట వచ్చిన ఆమె తెలిపారు. అదే విధంగా ఈ వర్షాకాలంలో ప్రజలు బయట తినుబండారాలను తినకూడదని, ఇంటిలోనే తాజా ఆహారాన్ని తయారు చేసుకొని భుజించాలని తెలిపారు. ఇలా చేయడం వల్ల డయేరియా, డీసెంట్రీ టైఫాయిడ్ మొదలగు జ్వరాలు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని వివరించారు.కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, ఏఎన్ఎం గీత, తదితరులు పాల్గొన్నారు.