వైద్య సేవల్లో భేష్‌ 

– కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
– ఉత్తమ వైద్య సేవలకు అవార్డు 
– అందుబాటులో అన్ని రకాల వైద్య పరీక్షలు 
నవతెలంగాణ – తాడ్వాయి 
పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. వైద్యులు, సిబ్బంది నియామకంతోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. దీంతో ప్రభుత్వదవాఖానల సేవలను వినియోగించుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల పరిధిలోని 7 గ్రామ పంచాయతీల ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నది. నిత్యం ఇక్కడకు 100 మంది వరకు పలు రకాల ఆరోగ్య సమస్యలతో వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరం ఉన్న వారి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నారు. రిపోర్టు ఆధారంగా వారికి సరైన చికిత్సలు అందిస్తున్నారు. అత్యవసర వైద్యం అవసరం ఉన్న వారిని ములుగు, వరంగల్ ఎంజీఎం తదితర పట్టణాల్లోని దవాఖానలకు రిఫర్‌ చేస్తున్నారు.
అందుబాటులో 102 వాహనం..
కాటాపూర్ ప్రభుత్వ దవాఖానలో నెలకు నాలుగు సార్లు గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. వారిని ఇంటి నుంచి 102 అమ్మ ఒడి వాహనంలో ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చి పరీక్షల అనంతరం ఇంటికి సురక్షితంగా చేరుస్తున్నారు. దీంతో వారికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా పోయాయి. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యంపై వారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
టీబీ, పైలేరియా రోగులకు..
టీబీ, లెప్రసీ, పైలేరియా రోగులకు కూడా ఇక్కడ ప్రత్యేక చికిత్సలు చేస్తున్నారు. తెమడ తదితర శాంపిళ్లను సేకరిస్తున్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత మందులతోపాటు దాతల సహకారంతో పోషకాహారాన్ని అందజేస్తున్నారు.
ఉత్తమ సేవలకు అవార్డు..
కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సింగిల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రంజిత్,  సూపర్వైజర్ సమ్మయ్య, ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల వారు ఉన్నారు. సమయపాలన పాటిస్తూ మెరుగైన సేవలతో నిరుపేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిరోజు 100 నుంచి 120 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు. వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. సీజనల్ వ్యాధులకు ముందు నుండే ప్రణాళిక ప్రకారం క్రిటికల్ ఏరియాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. ములుగు జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలను మొదటి స్థానంలో కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నందున, ఉత్తమ సేవలు అందించినందుకు డాక్టర్స్ డే సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య లు సన్మానించి, అవార్డు అందజేసి ప్రశంస పత్రం అందజేశారు. కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సన్మానించినందుకు ప్రశాంత పొందినందుకు ములుగు జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ప్రశంసించారు.