బాల్య వివాహాలపై ఈ నెల15వ తారీఖున కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఓ మైలురాయి లాంటిది. 18 ఏండ్ల లోపు ఉన్న ముస్లిం బాలికకు వివాహం చేశారనే ఆరోపణలపై కోర్టు స్పందించింది.”బాల్య వివాహాల నిషేధ చట్టం మతంతో సంబంధం లేకుండా భారతీయ పౌరులందరికీ వర్తిస్తుంది. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006, మతంతో సంబంధం లేకుండా భారతీయ పౌరులందరికీ వర్తిస్తుంది. ప్రతి భారతీ యుడు మొదట పౌరుడు. ఆ తరువాత మాత్రమే ఒక మతంలో సభ్యుడవుతాడు. పౌరసత్వం మొదటిది. మతం ద్వితీయమైనది.” అని తీర్పు ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. తీర్పులోని ఒక్కొక్క వాక్యం ఆణిముత్యం లాంటిది. ముందు మనం భారతీయులమనేది విస్తృత అర్థాన్ని ఇస్తుంది. దేశంలో మతమనేది వ్యక్తిగతం. బాల్య వివాహాలు శతాబ్దాలుగా వివిధ సంస్కృతులు, ప్రాంతాలలో కొనసాగుతున్న ఒక లోతైన సామాజిక సమస్య. బాలల శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సుపై బాల్య వివాహం హానికరమైన ప్రభావాలను గుర్తించి అనేక దేశాలు బాలల హక్కులను రక్షించడానికి చట్టాన్ని రూపొందించారు. మన దేశంలో బాల్య వివాహాల సమస్యను పరిష్కరించడానికి, మైనర్ల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌గా బాల్య వివాహాల నిషేధ చట్టం 2006లో ఆమోదించబడింది.
చట్టం అమలు తీరు
భారతదేశంలో బాల్య వివాహాల ఆచారం మొదటిసారిగా 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం-1929 ద్వారా చట్టబద్ధంగా నిషేధించబడింది. ఈ చట్టం 1978లో మహిళలకు కనీస వయస్సును 18 ఏండ్లకు, పురుషులకు 21 ఏండ్లకు పెంచింది. బాల్యవివాహాల నిషేధ చట్టం (2006) 1978 చట్టం స్థానంలో అదే కనీస వయో పరిమితులను కలిగి ఉంది. మనదేశంలో 2.4 కోట్లకు పైగా బాలవధువులు ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్ ఎస్) ప్రకారం ప్రపంచంలోని ఆరు కోట్ల బాల్య వివాహాలలో 40 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ ప్రకారం ప్రపంచంలో బాల్య వివాహాల రేటులో మనదేశం14వ స్థానంలో ఉంది. విభిన్న వివాహ సంప్ర దాయాలు, ఆచారాలు ప్రాంతాలు, కులాలు తెగల ఉండడం వలన దేశంలోని వాయువ్య ప్రాంతంలో ఆగేయం కంటే బాల్య వివాహాల రేటు ఎక్కువగా ఉంది. బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో బాల్యవివాహాల రేటు ఎక్కువగా ఉంది. పశ్చిమ బెంగాల్, బీహార్, త్రిపురలలో 20 నుండి 24 వయస్సు గల స్త్రీలలో 40శాతం కంటే ఎక్కువ మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. కేరళలో 18 ఏండ్లలోపు వివాహం చేసుకున్న మహిళలు శాతం 2015-16లో 7.6 ఉంటే 2019-20లో 6.3శాతానికి చేరుకుంది.ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం 20 నుండి 24 మధ్య వయస్సు గల స్త్రీలలో 23శాతం మంది 18 సంవత్సరాల కంటే ముందే వివాహం చేసుకున్నారు. 2005-06 మూడో సర్వేలో 47శాతం నుండి 2015-16 నాలుగో సర్వేలో 27 శాతానికి తగ్గాయి.
బాల్యవివాహాలు..పరిణామాలు
బాల్యవివాహాలు అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరినీ ప్రభావితం చేస్తాయి. అయితే ఆడపిల్లలను అసమానంగా ప్రభావితం చేస్తాయి. బాలికల బాల్యాన్ని తుంచి వేస్తాయి. పిల్లలకు విద్య, ఆరోగ్యం, దోపిడీ నుండి రక్షణ లాంటి ప్రాథమిక మానవ హక్కులను నిరాకరిస్తాయి.శిశు మరణాలు, ప్రసూతి మరణాలు, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలకు ఈ వివాహాలు దారి తీస్థాయి. పేదరికాన్ని శాశ్వతం చేస్తాయి. ఆర్థిక అవకాశాలను పరిమితం చేస్తాయి. మానసిక గాయాలకు దారి తీయవచ్చు. డిప్రెషన్, ఆందోళనకు కారణమవుతాయి. సామాజిక ఒంటరితనాన్ని పెంచుతాయి. ఇది కుటుంబం, సమాజం నుండి వేరుచేయడానికి దారితీస్తుంది. గృహహింస, లైంగిక వేధింపుల ప్రమాదాలను, ప్రసూతి మరణాల రోగాల రేటును పెంచుతాయి. చిన్న తల్లులకు జన్మించిన పిల్లలు అధిక మరణాల రేటును కలిగి ఉంటారు. ఆచారాలు సంప్రదాయాలు, పితృస్వామ్య సమాజం, కొన్ని సంస్కృతులలో చిన్న వయస్సులో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడం అమ్మాయి లైంగికతతో పాటు కుటుంబ గౌరవాన్ని ”రక్షిస్తుంది” అని భావిస్తారు. మతపరమైన నిబంధనలు, పెరుగుతున్న పెండ్లి ఖర్చులు, పేదరికం, కుల అసమానతలు, చట్టాల అమలులో అలసత్వం, లింగ వివక్ష, నిరక్షరాస్యత మొదలైనవి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
పరిష్కారాలు
బాల్య వివాహాలను అంతం చేయడం బహుళ వ్యవస్థల సమన్వయంతో కూడిన చర్యతో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రతీ వివాహం అధికారికంగా నమోదును తప్పనిసరి చేయాలి. బాలికలకు సాధికారత కల్పించాలి. బాలికలకు వారి కుటుంబాలకు ఆర్థిక మద్దతు కల్పించాలి. బాలికలకు ఉన్నతమైన నాణ్యత కలిగిన విద్యను అందించాలి. చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలును ఏర్పాటు చేయాలి. బాల్య వివాహాల నిషేధ అధికారులు ప్రజలలో అవగాహన కల్పించాలి. బాల్య వివాహాలపై అవగాహన కల్పించడంలో నిషేధించడంలో ప్రింట్, విజువల్ మీడియా కీలక పాత్ర పోషించాలి. చట్టాలను అమలు చేయాలి. వేగంగా శిక్షలు ఖరారు చేయాలి. అతిక్రమించిన వారిపై ఉక్కుపాదాన్ని మోపాలి.
– జనక మోహన రావు దుంగ, 8247045230
బాల్య వివాహాలు – సామాజిక సమస్య
10:19 pm