నవతెలంగాణ – సిరిసిల్ల
అదనపు కట్నం కోసం భార్యను వేదించిన భర్తకు ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు 1000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి సృజన బుధవారం తీర్పు వెల్లడించినట్లు గంభీరావుపేట ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ… కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన కుంట నాగరాజు కు గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన వసంతతో 2005 సంవత్సరంలో వివాహం జరిగింది.కొంత కాలం వీరి కాపురం సజావుగా జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు సంతానం కలుగగా కొన్నేళ్ల తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేదింపులకు పాల్పడగా వేధింపులు భరించలేక 2009 సంవత్సరంలో గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో నాగరాజు పై వసంత ఫిర్యాదు చేయగా , పోలీసులు నాగరాజు పై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యుషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ యమగంటి సతీష్ గౌడ్ వాదించగా గంభీరావుపేట ఎస్ఐ , సీఎంస్ ఎస్.ఐ. రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ జనార్దన్ రెడ్డి ఏడుగురు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో పాటు నిందితుడు నాగరాజు కు న్యాయమూర్తి ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు రూ. 1000రూపాయల జరిమానా విధించినట్లు ఎస్.ఐ తెలిపారు.