తండ్రే ఆమె రోల్‌మోడల్..! తండ్రి చెప్పినట్టే డిగ్రీ పరీక్షలు చివరిరోజే హైదరాబాద్ వచ్చేశారు. పని నేర్చుకునేందుకు ప్రజాశక్తి కార్యాలయానికి వెళ్లారు. ప్రజాశక్తి ప్రజల పత్రిక. కష్టజీవుల శ్రేయోభిలాషి అని బలమైన నమ్మకం కలిగింది. తనను తాను తీర్చిదిద్దుకునేందుకు పునాది పడింది. ఆమే జి.రాజకుమారి. ప్రజాశక్తిలో టెలీప్రింటర్ ఆపరేటర్‌గా ప్రవేశించి అసిస్టెంట్ ఎడిటర్ హోదాలో రిటైర్ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం నవతెలంగాణతో కూడా కలిసి మొత్తం 39 ఏండ్లు పని చేశారు. నవతెలంగాణ 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజాశక్తి, నవతెలంగాణతో పెనవేసుకున్న ఆమె అనుభవాలు పంచుకునేందుకు మానవి ఆమెను పలకరించింది.
మీ బాల్యం.. చదువు ఎలా సాగింది?
అమ్మ ద్రౌపది. నాన్న గుండాబత్తుల ఆంజనేయులు. నాన్న కమ్యూనిస్టు. మచిలీపట్నం మొదటి ఎమ్మెల్యే. ఒక కమ్యూనిస్టుగా నిత్యం పేదల మధ్యే ఉండేవారు. ఇంటికొచ్చిన తరువాత పేదలు మాతో వారి సమస్యలు చెబుతుండేవారు. ఆ ప్రభావం నాపై ఉంది. నాన్నలాగే పని చేయాలనిపించింది. మేం ముగ్గురు అక్క చెల్లెళ్లం. ఒక తమ్ముడు. పెంపకంలో ఆడా మగా తేడా చూపలేదు. అమ్మ ఆరోగ్యం బావుండేది కాదు. పెద్దక్క క్రిష్ణకుమారి మా అందరి మంచి చెడ్డలు చూస్తుండేది. మా హోమ్ వర్క్ చూడడం, ఆటపాటలూ… అన్నింట్లో ప్రోత్సహించేది. కాలేజీ చదువుకొచ్చే సరికి టైప్ రైటింగ్ తెలుగు, ఇంగ్లీష్ హయ్యర్, హిందీ ప్రవేశిక వరకూ పూర్తి చేశా.
ప్రజాశక్తిలో చేరాలనే ఆలోచన ఎలా వచ్చింది?
మా ఇంటికి ప్రజాశక్తి వీక్లీ, అంతకుముందు జనశక్తి వచ్చేది. మా పెద్దక్క సోవియట్ భూమి చదివేది. మాతో చదివించేది. 1981లో ప్రజాశక్తి డైలీ కావడం, అప్పుడే నా డిగ్రీ పూర్తవడం, నేను హైదరాబాద్ రావడం వరుసగా జరిగిపోయాయి. ఇక్కడకు రాగానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ప్రజాశక్తి ఆఫీసుకు వెళ్లడం, టెలీ ప్రింటర్ ఆపరేటర్‌గా నా వర్క్ ప్రజాశక్తితో మొదలయింది.
పత్రికలో పని ఎలా ఉండేది?
ఇక్కడ పత్రిక ప్రత్యేకత గురించి చెప్పాలి. ప్రజాశక్తి ప్రజల పత్రిక. కష్టజీవుల పత్రిక. అందుకనుగుణంగానే యావత్తు యంత్రాంగం సమిష్టిగా పనిచేయాల్సి ఉంటుంది. ఆఫీసులో కుటుంబ వాతావరణం ఉండేది. ఒక ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఉమ్మడిగా చర్చించి పని విభజన చేసుకునేవాళ్లం. చివరకు ఆఫీసు కూడా బాయ్ నుంచి ఎడిటర్ వరకూ శుభ్రం చేసుకునేవాళ్లం. మనది పురుషాధిక్య సమాజం. పురుషులు ఎక్కువమంది పనిచేసేచోట ఒక మహిళగా అక్కడ పనిచేయడం ప్రజల పత్రిక కావడంవల్లే సులువైంది. వారిలో సమభావం వల్ల సంస్థ ఒక పని అప్పగించేటప్పుడు మహిళా, పురుషుడా, తక్కువపనా, ఎక్కువపనా అని చూడలేదు. తమతో సమానంగా చూడటం, భద్రతా, ఆరోగ్యం అంశాల్లో శ్రద్ధా.. రాత్రి వరకూ పనిచేయాల్సిన రంగం.. అయినా ఏ రోజూ అభద్రతా భావానికి లోనుకావాల్సిన పరిస్థితి రాలేదు.
పత్రిక నుండి నేర్చుకున్నది?
బాధ్యులు బాధ్యతలు అప్పచెప్పడమూ అలాగే ఉండేది. పనిలో వారు సహకరిస్తూ ప్రోత్సహించడం, ఇండిపెండెంట్ రెస్పాన్స్‌బులిటీస్ అప్పగించడం, పర్యవేక్షించడం, మెలకువలు నేర్పడం రోజువారీ ప్రక్రియ. ఇలా పూలదండలో దారంలా సమిష్టిగా పని నడిచేది. ఈ ప్రాసెస్ అంతా ఒక ఉత్తమ జర్నలిస్టుగా నన్ను నేను మలుచుకోవడానికి బాగా తోడ్పడింది. పత్రికలో పని పరస్పర సంబంధం ఉంటుంది. సకాలంలో పత్రిక రావడానికి ఇది చాలా అవసరం. సమయం, సందర్భం, ఆచరణ మేళవించడం కీలకం. అప్పుడే కదా సత్ఫలితాలొస్తాయి. ఈ రూపంలో ప్రజాశక్తి, నవతెలంగాణ రెండూ అనేక అవకాశాలు నాకు కల్పించాయి. నేను ఏ మేరకు న్యాయం చేయగలిగాను, ఏ మేరకు వారి అంచనాకు తగిన విధంగా అందుకోగలిగానో తెలియదు.
ఎలాంటి అవకాశాలు కల్పించాయి?
అన్నిరకాల బాధ్యతలకూ అవకాశం కల్పించాయి. ఒక టెలీప్రింటర్ ఆపరేటర్‌గా ప్రవేశించి అసిస్టెంట్ ఎడిటర్ స్థాయికి చేరుకున్నాను. రిపోర్టింగ్, డెస్క్ ఇన్ఛార్జిగా, మొఫషిల్ ఎడిటర్, ఫీచర్స్ చూశాను. కొన్ని సందర్భాల్లో ఫీల్డ్ అవకాశం కల్పించింది. జర్నలిజం కళాశాలలో కోచింగ్ ఇచ్చే అవకాశం దక్కింది. ఆ తరువాత కాలంలో ఎడిట్‌పేజీ బాధ్యతలు అప్పచెప్పారు. అలా జర్నలిజంలో ‘అ’ నుండి ‘క్ష’ వరకూ నేర్చుకున్నది ప్రజాశక్తిలోనే.
పెండ్లి తర్వాత వృత్తి జీవితానికి ఆటంకాలు రాలేదా?
కాలేదు. అయితే సమన్వయం చేసుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఎస్.వీరయ్యగారితో వివాహమైంది. అప్పట్లో ఆయన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. బాబును నాతో ఆఫీసుకు తీసుకెళ్లేదాన్ని. వాడి కోసం ఆఫీసులోనే ఊయల కట్టాను. నాతోటి ఉద్యోగులు కూడా బాబును చక్కగా చూసుకునేవారు. ఆ తర్వాత మా ఆడపడుచు చూసుకుంది. అలా ఇంట్లో కూడా మంచి వాతావరణం ఉండేది. అత్తయ్య, మామయ్య అయితే తమ బిడ్డలాగే నన్నూ చూసారు.
నేటి తరం జర్నలిస్టులకు మీ సూచన?
నేర్చుకోవాలనే తపన ముఖ్యం. ఓర్పూ, నేర్పూ ఎదుటివారి నుంచి నేర్చుకోవాలనే నమ్రతా చాలా అవసరం. ప్రజల పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. ప్రజా ప్రయోజనాలకు హాని కలిగే విధంగా ఏ ఒక్క జర్నలిస్టూ రాయొద్దని నా సూచన. పనిలో నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏ పనీ కూడా ఇది బరువేమో..మన వల్ల కాదేమో అనే సంకోచం ఉండొద్దు. మనం కూడా చేయగలం… అని భావిస్తే కచ్చితంగా ఆ పని సులువే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగంగా కాకుండా ఉద్యమంలా భావించాలి.. ఆచరించాలి.