పతకాలపై ఆశలు రేపుతున్న లౌవ్లీనా, స్వప్నిల్‌

పతకాలపై ఆశలు రేపుతున్న లౌవ్లీనా, స్వప్నిల్‌– బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌లోనూ గెలుపే..
– పారిస్‌ ఒలింపిక్స్‌
పారిస్‌: పారిస్‌ ఒలింపిక్స్‌లో ఐదోరోజు భారత్‌కు ఒక్క పతకం దక్కకున్నా.. మెరుగైన ఫలితాలు సాధించారు. షూటింగ్‌లో స్వప్నిల్‌ కుశాలే, మహిళల బాక్సింగ్‌లో లౌవ్లీనా బోర్గోహైన్‌ పతకాలకు చేరువయ్యారు. 50మీ. రైఫిల్‌ 3 ఈవెంట్‌లో స్వప్నిల్‌ ఫైనల్‌కు చేరగా.. బాక్సర్‌ లౌవ్లీనా బోర్గోహైన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. టేబుల్‌ టెన్నిస్‌ మహిళల విభాగంలో శ్రీజ ఆకుల ముందంజ వేయగా.. మనికా బత్రా ఓటమిపాలైంది. ఇక బ్యాడ్మింటన్‌ విభాగంలో లక్ష్యసేన్‌ ఏకంగా 3వ ర్యాంక్‌ ఆటగాడు జొనాథన్‌ క్రిస్టీ(మలేషియా)పై సంచలన విజయం సాధించాడు. అలాగే పివి సింధు కూడా ప్రి క్వార్టర్స్‌కు చేరి పతకంపై ఆశలు రేపింది.
షూటింగ్‌ ఫైనల్‌కు స్వప్నిల్‌
50మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఈవెంట్‌లో స్వప్నిల్‌ కుసాలే అదరగొట్టాడు. ఫైనల్‌కు చేరి విశ్వ క్రీడల షూటింగ్‌లో ఫైనల్‌ చేరిన ఐదో భారత షూటర్‌గా స్వప్నిల్‌ గుర్తింపు సాధించాడు. బుధవారం జరిగిన పురుషుల పోటీల్లో స్వప్నిల్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. నిలకడైన గురితో నీలింగ్‌ రౌండ్‌లో 198 పాయింట్లు, ప్రొన్‌ రౌండ్‌లో 197 పాయింట్లు సాధించి 7వ స్థానంలో నిలిచాడు. దాంతో, ఫైనల్‌కు దూసుకెళ్లి పతకంపై ఆశలు రేపాడు. నేడు ఫైనల్‌ రౌండ్‌ జరగనుంది. ఇదే విభాగంలో ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ నిరాశపరిచింది. 11వ స్థానంలో నిలిచాడు. టాప్‌-8 షూటర్స్‌ ఫైనల్లో పతకాలకు పోటీపడనున్న సంగతి తెలిసిందే.
పతకానికి చేరువలో లౌవ్లీనా
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా బాక్సర్‌ లౌవ్లీనా బొర్గోహైన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటింది. బుధవారం జరిగిన మహిళల 75 కిలోల విభాగం బౌట్‌లో లొవ్లొనా నార్వేకు చెందిన సున్నివా హొఫ్‌స్తాద్‌ను చిత్తుగా ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన లౌవ్లీనా తొలి రౌండ్‌ నుంచి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. ఆమె ధాటికి సున్నివా కోలుకోలేకపోయింది. దాంతో 5-0 పాయింట్లతో లౌవ్లీనాను అంపైర్లు విజేతగా ప్రకటించారు. దీంతో లౌవ్లీనా పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. క్వార్టర్‌ఫైనల్లో లీ కియాన్‌ (చైనా)తో తలపడనుంది. సెమీస్‌ చేరితే లౌవ్లీనాకు పతకం ఖాయం కానుంది. 54కిలోల విభాగం ప్రి క్వార్టర్స్‌లో ప్రీతి పవార్‌ ఓటమి పాలైంది. కొలంబియా ప్రత్యర్థి యేని మార్సిలా ఏరియస్‌ చేతిలో 2-3 పాయింట్ల తేడాతో ప్రీతి పరాజయం చవిచూసింది. పాన్‌ అమెరికా గేమ్స్‌ చాంపియన్‌, ప్రపంచ రజత పతక విజేత యేని బలమైన పంచ్‌లు విసిరింది. తొలి రౌండ్‌లో ప్రీతి 1-4 తేడాతో ఓటమి పాలైంది. కానీ ఆ తర్వాత మెరుగ్గా రాణించింది. ఆ తర్వాత కొలంబియా క్రీడాకారిణి పంచ్‌ల నుంచి తప్పించుకున్న ప్రీతి స్వల్ప తేడాతో బాక్సింగ్‌ మ్యాచ్‌ను చేజార్చుకుంది.
ప్రి క్వార్టర్స్‌కు లక్ష్యసేన్‌, సింధు
బ్యాడ్మింటన్‌ ఆటగాళ్లు లక్ష్యసేన్‌, పివి సింధు ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన గ్రూప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో.. ప్రపంచ 3వ ర్యాంక్‌ ప్లేయర్‌ జొనాథన్‌ క్రిస్టీపై 21-18, 21-12తో విజయం సాధించాడు. తొలి గేమ్‌లో 2-8 తేడాతో వెనుకబడ్డా సేన్‌.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొన్నాడు. ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చి ఆ గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌ స్టార్టింగ్‌లో ఇద్దరి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. ఇండోనేషియాకు చెందిన జొనాథన్‌ ఆధిక్యం కోసం ప్రయత్నించినా.. సేన్‌ దూకుడుగా ఆడాడు. ప్రి క్వార్టర్స్‌లో భారత్‌కే చెందిన హెచ్‌.ఎస్‌. ప్రణరుతో తలపడే అవకాశముంది. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో సింధు 21-5, 21-10తో ఎస్టోనియాకు చెందిన కుబ్బాపై విజయం సాధించింది.
ప్రి క్వార్టర్స్‌లో ఓడిన మనిక
టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనిక బత్రా ప్రి క్వార్టర్స్‌లో ఓటమిపాలైంది. బుధవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌ పోటీలో మనిక 6-11, 9-11, 14-12, 7-11, 6-11తో జపాన్‌ క్రీడాకారిణి చేతిలో ఓటమిపాలైంది. అంతకుముందు ఫ్రాన్స్‌ క్రీడాకారిణి, 18వ సీడ్‌ ప్రిథికా పవడేపై 4-0తో జయకేతనం ఎగురవేసి ప్రి క్వార్టర్స్‌కు చేరింది. ఇక సింగపూర్‌కు చెందిన జియాన్‌ జెంగ్‌ను శ్రీజ 4-2తో ఓడించి ప్రి క్వార్టర్స్‌కు చేరింది. హోరాహోరీగా సాగిన పోరులో శ్రీజ 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10తో ప్రత్యర్థిని మట్టికరిపించింది. స్థానిక క్రీడాకారిణి అయిన ఇక పురుషుల విభాగంలో సీనియర్‌ ఆటగాడు అచంత శరత్‌ కమల్‌ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు.