బ్యాంక్‌లు రూ.2,331 కోట్ల బాదుడు

బ్యాంక్‌లు రూ.2,331 కోట్ల బాదుడు– కనీస నిల్వలులేని ఖాతాలపై వసూళ్లు
న్యూఢిల్లీ : కనీస నిల్వలు పాటించని ఖాతాదారులపై బ్యాంక్‌లు జరిమానా పేరుతో భారీగా వసూళ్లు చేశాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మినహా పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాల్లో కనీస నిల్వను నిర్వహించడంలో విఫలమైనందుకు ఖాతాదారుల నుంచి రూ.2,331 కోట్లు వసూలు చేశాయి. 2022-23లోని రూ. 1,855.43 కోట్లతో పోల్చితే.. ఈ చార్జీల వసూళ్లలో 25.63 శాతం పెరిగింది. ఈ బ్యాంకులు గత మూడేండ్లలో కనీస నిల్వను నిర్వహించనందుకు ఖాతాదారుల నుంచి రూ.5,614 కోట్లు వసూలు చేశాయి. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మాత్రం 2019-20 నుంచి కనీస బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేయని ఖాతాదారులపై జరిమానా విధించడాన్ని నిలిపివేసింది. 2022-23లో పీఎన్‌బీ గరిష్టంగా రూ.633.4 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.386.51 కోట్లు, ఇండియన్‌ బ్యాంక్‌ రూ.369.16 కోట్లు చొప్పున వసూలు చేశాయి. ప్రయివేటు రంగ బ్యాంకులు విధించే చార్జీలను పరిగణనలోకి తీసుకుంటే కనీస నిల్వల్లో తగ్గుదలపై జరిమానాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని ప్రయివేటు బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వలు ఉంచడంలో విఫలమైతే ఖాతాదారుల నుంచి భారీ మొత్తాలను వసూలు చేస్తున్నాయి.