– 18 శాతం పన్ను సమంజసం కాదు
– వైద్య బీమా విస్తృతికి అడ్డంకి : మంత్రి సీతారామన్‌కు గడ్కరీ లేఖ
నాగ్‌పూర్ : జీవిత, వైద్య బీమా పథకాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను రద్దు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. బీమా ప్రీమియంలపై వసూలు చేస్తున్న జీఎస్టీని తొలగించాలని ఆయన లేఖలో సూచించారు. నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన మెమోరాండం ప్రకారం లేఖ రాస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. కుటుంబానికి రక్షణ కల్పించడానికి, ప్రమాదాల సమయంలో సహాయంగా నిలిచే బీమాపై పన్నును యూనియన్ వ్యతిరేకిస్తోందని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ అనేది సమంజసం కాదన్నారు. బీమా అనేది సామాజిక అవసరం అని తెలిపారు. కాబట్టి జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై పన్నును ఉపసంహరించుకోవాలని కోరారు.
”జీవిత, ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తొలగించా లని ఉద్యోగ సంఘాలు అభ్యరిస్తున్నాయి. వాటిపై 18 శాతం జీఎస్టీ ఉంది. జీవిత బీమాపై ప్రీమియంపై పన్ను విధించడమనేది జీవితంలోని అనిశ్చితిపై పన్ను వేయడమే. కుటుంబానికి రక్షణ ఇచ్చేందుకు తీసుకునే ఈ బీమాపై పన్ను ఉండకూడదని భావన. అంతేకాదు సామాజికంగా ఎంతో అవసరమైన వైద్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ ఆ రంగం వృద్ధికి అడ్డంకి. ఈ నేపథ్యంలోనే యూనియన్లు జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి.” అని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు.
జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ప్రస్తుతం ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. మరోవైపు కరోనా తర్వాత ఆరోగ్య బీమా ప్రీమియం ఏటా 10-15 శాతం వరకూ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో చాలామంది వాటి భారాన్ని మోయలేక పాలసీలను పునరుద్ధరించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో బీమాపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని అటు పాలసీదారులు, ఇటు పరిశ్రమ వర్గాలూ ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీన్ని 5 శాతానికి కుదించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.