– ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం తనిఖీ
– గోశాల సందర్శనలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
నవతెలంగాణ – వేములవాడ
వర్షా కాలం నేపథ్యంలో గోశాల లోనీ గోవుల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. వేములవాడ రాజ రాజేశ్వరస్వామి ఆలయానికి చెందిన గోశాల ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోశాల లో క్షేత్ర ప్రదర్శన చేసి, గోవులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. గోశాల ను పరిశుభ్రంగా ఉంచాలని, నిత్యం వాటిని పర్యవేక్షిస్తూ సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంతమంది సిబ్బంది, వైద్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ గోశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పిల్లలకు పోషకాహారం అందించాలి..
ప్రభుత్వ నిర్దేశానుసారం పిల్లలకు పోషకాహారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. తిప్పాపూర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం సమీపంలోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పై వివరాలు తెలుసు కున్నారు. పిల్లలకు ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇతర సబ్జెక్టు లలో ప్రాథమిక అంశాల పై అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట ఆయా శాఖల అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.