30 సంవత్సరాల అలుపెరుగని మాదిగల పోరాటమే ఎస్సీ వర్గీకరణ అని జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యదర్శి కొత్తల యాదగిరి శుక్రవారం అన్నారు. మండలంలోని ఉప్పల్ వాయి, రామారెడ్డి లో ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పాల అభిషేకాలు చేశారు. టపాకాయలు కాల్చి, స్వీట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ…. ప్రకాశం జిల్లాలో ఈదుమూడి గ్రామంలో 20 మంది కార్యకర్తలతో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 1994 ప్రారంభమైన ఉద్యమం మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో దశలవారీగా దేశవ్యాప్తంగా వ్యాపించి 20 లక్షల మందితో మాదిగ పోరాట రిజర్వేషన్ పోరాట సమితి ఎదిగిందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బట్టు వెంకట రాములు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తి గారి లక్ష్మి, గురజాల నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ గంగారం, రాజనర్సు, కిషన్, నర్సింలు, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.