కొలంబో : మహిళల ఆసియా కప్‌లో ఆటపట్టు సేన.. హర్మన్‌సేనకు ఇచ్చిన ఝలక్ మరువక ముందే.. లంకేయులు టీమ్ ఇండియాకు గట్టి షాక్ ఇచ్చారు. భారత్, శ్రీలంక తొలి వన్డేలో విజయం దిశగా దూసుకెళ్తోన్న రోహిత్ సేనకు స్పిన్నర్లు బ్రేక్ వేశారు. ఆఖర్లో వరుస వికెట్లతో మ్యాచ్‌ను టై చేయగలిగారు. వానిందు హసరంగ (3/58), చరిత్ అసలంక (3/30), సహా డునిత్ వెల్లలాగె (2/39) రాణించటంతో ఆతిథ్య శ్రీలంక తొలి వన్డేలో నిలిచింది. 231 పరుగుల ఛేదనలో భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (58, 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరువగా.. కెఎల్ రాహుల్ (31, 43 బంతుల్లో 2 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (23, 23 బంతుల్లో 4 ఫోర్లు), శివం దూబె (25, 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (33, 57 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అసలంక ఓవర్లో బౌండరీతో స్కోరు సమం చేసిన శివం దూబె.. లాంఛనం ముగిస్తాడని అనుకుంటే.. వరుస బంతుల్లో దూబె, అర్షదీప్ (0)ను అవుట్ చేసిన అసలంక పర్యాటనకు జట్టుకు షాక్ ఇచ్చాడు. విరాట్ కోహ్లి (24), శుభ్‌మన్ గిల్ (16), వాషింగ్టన్ సుందర్ (5) నిరాశపరిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిశాంక (56), డునిత్ వెల్లలాగె (67) అర్థ సెంచరీలతో 50 ఓవర్లలో 230/8 పరుగులు చేసింది. భారత్, శ్రీలంక రెండో వన్డే ఆదివారం జరుగనుంది.