విద్యారంగంపై చిత్తశుద్ధేది?

ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో ఈ సంవత్సరం కూడా సమస్యలతోనే స్వాగతం పలికాయి. కేజీ టూ పీజీ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నా క్షేత్రస్థాయి అమలులో అనేక లోపాలు విద్యార్థులు, తల్లిదండ్రులను వేధిస్తూనే ఉన్నాయి. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కు కోవాలంటే విజ్ఞానమే సరైన మార్గం. కానీ ఆ విద్యను సర్కార్‌ అరకొర వసతుల మధ్య నెట్టుకురావడం ఆందోళన కలిగించే అంశం. విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న సర్కార్‌ అమలులో చిత్తశుద్ధి కొరవడింది. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య సుమారుగా 28లక్షల మంది ఉన్నారు. వీరికి లక్ష వరకు టీచర్స్‌ భోదిస్తున్నారు. కానీ ఇంకా 28,511 ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. అసెంబ్లీలో 5,571మంది టీచర్‌ పోస్టులు మంజూరు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కనీసం ఉత్తర్వులు కూడా జారీ చేయలేదు. ఖాళీగా ఉన్న పోస్టులు స్కూల్‌ అసిస్టెంట్‌ 7,111, ఎస్జీటీ 6,975 పోస్టులు , పీజీటీ 99, సంస్కృతంలో 23 పోస్టులు, ఆర్ట్‌ డ్రాయింగ్‌లో 331, క్రాప్ట్‌ ఇన్‌స్పెక్టర్‌ 443, ఎంఈఓ 484 పోస్టులకు గాను 467 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రధానోపా ధ్యాయులు 2043 ఖాళీ, డిప్యూటీఈఓ 62 పోస్టులుకుగాను, 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదనపు పోస్టులు రిటైర్మెంట్‌, ప్రమోషన్లు, బదిలీల కారణంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండానే విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇంగ్లీష్‌ మీడియం విద్యను కూడా బోధించడం కోసం టీచర్లు మరింత అవసరం. నాణ్యమైన విద్య అందిం చాలంటే, అందరికీ ఇంగ్లీషులో బోధన చేయాలన్న రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, ప్రభుత్వ బడులును బాగుపరచడం కష్టాతరం.
రాష్ట్రవ్యాప్తంగా 8,980 ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు మూత్రశాలలు లేవని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. విద్యహక్కు చట్టం ప్రకారం ప్రతి స్కూల్లో బాలబాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు మూత్రశాలలు ఉండాలని నిబంధనలు ఉన్న, ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. బాలికలకు టాయిలెట్స్‌ లేని రాష్ట్రాలతో పోల్చడంలో మన రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. తరగతి గదులు అధ్వాన్నంగా ఉన్నాయి. తలుపులు, కిటికీలు లేని గదులు, కంపు కొడుతున్న మరుగుదొడ్లు, నీటి వసతులు లేని టాయిలెట్లు, పైపెచ్చులుడుతున్న పాత భవనాలు, నెర్ర లిచ్చిన గోడల మధ్య విద్యాభ్యాసం కొనసాగుతుండటం బాధాకరం. శిథిలావస్థకు చేరుకున్న సర్కారు బడులను మరమ్మతులు చేయకుండానే తరగతులను నిర్వహిస్తున్నారు. దీంతో కొంతమంది ప్రయివేటు స్కూళ్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. మరికొంతమంది చదవు కొనుక్కోలేక, సర్కార్‌ బడుల్లో చదవలేక డ్రాపౌట్స్‌గా మారుతున్నారు. పైగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉందని చూపడానికి అధికారులు నానాయాతన పడుతున్నారు. దీనికి జిల్లా విద్యాధికారులే తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం? నిన్నటి పత్రికలు పరిశీలిస్తే సిద్దిపేట జిల్లా డీఈవో మొత్తం ప్రభుత్వ పాఠశాలలో 6వేల మంది విద్యార్థులు అడ్మిషన్‌ అయ్యారని చెప్పారు. కానీ వాస్తవాలను పరిశీలిస్తే వెయ్యి మంది కూడా అడ్మిషన్‌ కాలేదని సమాచారం. ఇలా తప్పుడు సంకేతాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు మరింత నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది.
పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫామ్స్‌, టై, బెల్ట్‌ ఇవ్వాలని అధికారులు ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ నేడు పరిస్థితి ఏమిటి? విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్‌ పంపిణీ విషయంలో ఇంకా గందరగోళం నెలకొని ఉంది. యూనిఫామ్స్‌ కుట్టుపని ఇంకా పూర్తి కానేలేదు. కనీసం 50శాతం కూడా ఫ్రింట్‌ కాలేదు, కానీ పూర్తిగా ఫ్రింట్‌ అయినవి అన్ని జిల్లాలకు పంపించామని అధికారులు చెబుతున్నారు. అనేక సంవత్సరాలుగా వస్తున్న పరిస్థితి ఈ విద్యా సంవత్సరంలో కూడా అదే తరహాలో ఉంది. కనీసం రెండు జతల దుస్తులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే ఆలోచించాల్సిన పరిస్థితి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విద్యార్థులు పాత దుస్తుల్నే ఇస్త్రీ చేసుకుని వస్తున్నారు. ఇంకా ‘మన ఊరు మన బడి’ పథకం కూడా నత్తనడకనే కొనసాగుతున్నది. ఈ పథకం ద్వారా ప్రధానంగా మౌలిక వసతులు కల్పన, డిజిటల్‌ విద్య, తాగుతనీరు, సరిపడా ఫర్నిచర్‌, ప్రహరీలు, కిచెన్‌షెడ్‌లు, మరుగుదొడ్లు, మూత్రశాలలో ఇలా 12రకాల పనులు పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం నోటి మాటలు నీటిమూటలుగానే ఉన్నాయి. 26,065 పాఠశాలలో రూ.7,289 కోట్లతో సౌకర్యాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. శిథిలావస్థలో ఉన్న వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మాణం చేయాలని, మొదటి విడతగా 9,123 పాఠశాలను ఎంపిక చేసింది. ఇందులో రూ.3,497 కోట్లు మౌలిక సదుపాయాల కోసమే అన్నారు. ఫిబ్రవరిలోనే వీటిలో చాలా పాఠశాలల్లో పనులు పూర్తయినవి అని సంబరాలు జరుపుతు న్నామని చెప్పుకొచ్చారు. కానీ సగమే పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైనా నేటికీ పనులు పూర్తికాలేని పరిస్థితి. అంగు ఆర్భాటాల కోసం లక్షల కోట్ల రూపా యలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదో నేటికీ అర్థం కాని ప్రశ్నే.
తాటికొండ రవి
9177302248