ఇంకెన్నాల్లో..!

In other..!– ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు..
-ఊహల్లో ఆశావహులు
– అవకాశం కోసం నాయకుల చుట్టూ చక్కర్లు
– కాలం కరిగిపోతోందంటూ ఆవేదన
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల తరువాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నామినేటెడ్ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సుదీర్ఘ కాలంగా పార్టీతోనే ఉంటున్నవారు తగిన గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి పదవుల కోసం ఇంకొందరు, మార్కెట్ కమిటీలు, సీడీసీలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్,ఆలయాల అభివృద్ధి కమిటీలు వంటి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక్కరితోనే సరి..
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొంత కాలానికి కార్పొరేషన్ చైర్మన్ల నియామకంలో భాగంగా మంథని నియోజకవర్గంలో మల్హర్  మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు ఐత ప్రకాష్ రెడ్డికి ట్రేడ్ ఇండస్ర్తిట్ చైర్మన్ గా పదవి  అప్పజెప్పారు. తర్వాత ఇంకా ఎలాంటి నియామకాలు జరగలేదు. దీంతో నామినేటెడ్ పదవుల కోసం ఆశలు పెట్టుకున్న ఛోటామోటా నాయకులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఆశావహులెందరో?
మంథని నియోజకవర్గం అటు పెద్దపల్లి,ఇటు భూపాలపల్లి రెండు జిల్లాల్లో 9 మండలాలతో విస్తరించి ఉంది.ఈ మండలాల్లోని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర స్థాయి,జిల్లా స్థాయిలో కార్పొరేషన్ , గ్రందాలయ, ఆలయ కమిటీ పదవులకు ఆశిస్తున్నగా తెలుస్తోంది.ఎవరిప్రయత్నాల్లో వారు ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. మొదటి విడతలోనే తమకు అవకాశం దక్కుతుందని ఆశించినా. పదవి దక్కలేదు.రెండవ విడత కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కష్టపడ్డవారికే ప్రాధాన్యత..
నామినేటెడ్ పదవుల భర్తీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎవరెవరు కష్టప డ్డారు? ఎవరు పనిచేయలేదన్న అంశాన్ని పరిగణ నలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ గ్రామాల్లో వచ్చిన ఓట్లు, తాము చేసిన పనిని గురించి పలువురు నాయకులు చెప్పుకునే ప్రయత్నాలు చేశారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంథని నియోజకవర్గంలో ఎవరెవరూ సహకరించారన్న దానిపై ఇప్పటికే రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు మంత్రి అనుచరులు నివేదికలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. అనివేదికలను పరిగణలోకి తీసుకుంటే పదవులు ఎవరికి దక్కుతాయో అన్నదానిపై చర్చ సాగుతోంది.
ముఖ్యనాయకుల చుట్టూ..
పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన తమకు పదవులు వస్తాయన్న ఆశతో చాలామంది నాయకులున్నారు.అయితే ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడచినా ఇప్పటికీ పదవుల పందేరం మొదలుకాకపోవడంతో నాయకుల్లో నైరాశ్యం నెలకొంటోంది. పదవుల కోసం ఊహల్లో విహరిస్తున్నవారు ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఏదో ఒక పదవి కావాలని తమ రాజకీయ గురువులతో మొరపెట్టుకుంటున్నారు. తమకు పదవి ఇప్పించమని తెలిసిన తమ వర్గాల నాయకుల ద్వారా నామినేటెడ్ పదవుల కోసం విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.