ఇటీవల తెలుగు నేల మీద పెరిగిన బాల సాహిత్య స్పృహ గురించి మనకు తెలుసు. రాశిలోనూ, వాసిలోనూ మిన్నగా వస్తోంది. ఎందరో వరిష్ఠ రచయితలు మొదలు ఉద్యమ రచయితల వరకు బాల సాహిత్య సృజన చేస్తున్నారు. అన్ని ప్రక్రియలు, రూపాల్లో విరివిగా రాస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం ఉపాధ్యాయ రచయితలు కావడం విశేషం. ఈ కోవలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి పిల్లల కోసం రాసిన సాహిత్యం, పిల్లలు తమ కోసం తాము రాసిన సాహిత్యం పెద్ద సంఖ్యలో వస్తుండడం అభినందనీయం.
పందొమ్మిదవ దశకం చివరి ప్రాంతంలో నల్లగొండ జిల్లా నుండి బాల సాహిత్యాన్ని రాసి, అచ్చువేసుకుని ఇటు ఉపాధ్యాయునిగా, అటు కవిగా, రాజీవ్ విద్యా మిషన్ స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా, కవి, రచయిత, విమర్శకుడుగా వెలిగిన వారిలో ఉపాధ్యాయ కవి, బాల సాహితీవేత్త దొడ్డి రామ్మూర్తి ఒకరు. రామ్మూర్తి నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకోండిలో ఆగస్టు 20, 1968 న పుట్టారు. శ్రీమతి దొడ్డి మారమ్మ-శ్రీ సాపయ్యలు అమ్మా నాన్నలు. ఎం.ఎ. తెలుగుతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాయలంలో ఎం.ఎ సంస్కృతం చదివారు. ఈయన భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణకు రూమ్మెట్, నాకు తెలంగాణ ఉద్యమ మిత్రుడు కూడా.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన దొడ్డి రామ్మూర్తి పాఠాల బోధనతో పాటు తొలినాళ్ళ నుండి సమగ్రశిక్ష నిర్వహించిన అనేక కార్యశాలల్లో పాల్గొన్నారు. పాఠ్యపుస్తక రూపకల్పనల్లో పాల్గొన్నారు. అస్థిత్వవాద కవిగా తనదైన ముద్ర వేసిన రామ్మూర్తి తొంభయ్యవ దశకం నుండి బాల గేయాలు రాస్తున్నారు. కవి, కథకుడు, విమర్శకుడుగా రామ్మూర్తి సాహితీలోకానికి ఎరుక. ఈయన రాసిన ‘బొక్కెన లొల్లి’ దళితపాట, ‘బొండిగ’ దళిత కథలు ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తాయి. దొడ్డి రామ్మూర్తి మార్మికకవి కూడా. ‘జంత్రి’ రామ్మూర్తి మార్మిక కవితా సంపుటి. నల్లగొండ జిల్లా జీవభాషను తన కవిత్వంలో ఎట్లా ఉపయోగించుకోవాలో ఈ కవికి బాగా తెలుసు. అందుకు ఈ సంపుటిలోని అనేక కవితలు, కవితా శీర్షికలు చూడొచ్చు. ‘గార్వాలగన్నె’ కవితలో ‘చెమట చెక్కిన శిల ముడుపు కట్టిన కోవెల/ నోము రతం రొండొక్కలయిన/ పాలకాయ పంటైతదా/ బొడ్డు తెగిన పావిరం పాలకుతి పొత్తిలి/… కలిమి గుంజిన అద్దదుపు/ దమ్మిడి దక్కని జంతు సంతు/ వినికిడి తొక్కిన విష కౌగిలి విద్వంస చర్య…’ అంటూ సాగుందీ కవిత. ‘సద్దిముల్లె’లో ‘ఊట సెలిమెల తల్లి నా వాన సుక్క/ ఊరు సద్దిముల్లె నా వానసుక్క’ అంటారు రామ్మూర్తి. ఈయన మరో కవితా సంపుటి ‘చెలిమెపాట’, ఇది 2008 లో వచ్చింది. రాజీవ్ విద్యా మిషన్ నల్లగొండ నిర్వహించిన బాల సాహిత్య రచన, ఎడిటింగ్ కార్యశాలల్లో పాల్గొన్నారు. ఈ సంస్థ పక్షాన దాదాపు 230 ప్రచురణలు రాగా వాటికి రామ్మూర్తి సంధానకర్తగా ఉన్నారు.
రామ్మూర్తి బాల వికాసకారునిగా చేసిన, చేస్తున్న పనులు కూడా నల్లగొండ జిల్లాలో ఎన్నదగ్గవి. 2008లో ఈయన సంపాదకులుగా పిల్లల కవితల పుస్తకం ‘పిట్టగూళ్ళు’ తెచ్చారు. తరువాత లిపి సాంస్కృతిక వేదిక, నల్లగొండ పక్షాన ‘జాలు’ పేరుతో పిల్లల కథల పుస్తకం తెచ్చారు ఇది 2017లో అచ్చయ్యింది. ‘ముచ్చట్ల చెట్టు’ బాలల కవిత్వం, ‘బడిపిల్లల యాత్ర’, ‘పిల్లల నడక’ బడి పిల్లల కవిత్వంతో పాటు ‘పదును’ పిల్లల కథలు అచ్చులోకి రానున్నాయి. రచయితగా అచ్చులోకి వచ్చిన రామ్మూర్తి రచనలో బాల సాహిత్యమే మొదటిది కావడం విశేషం. ‘చిలుకల దండ’ పేరిట ఇది 2003లో అచ్చయ్యింది. ఇందులోని ప్రతి గేయం లయాత్మకంగా ఒక మెరుపులాగా ఉంటుంది. తన ప్రాంత భాషను తన బాల గీతాల్లో ఎంత వీలయితే అంతగా ఉపయోగించారు రామ్మూర్తి. సమగ్రశిక్ష కార్యశాల వరంగల్‌లో ఈ పుస్తకం 2003లో ఆవిష్కరణ కాగా వ్యాసకర్త అందులో పాల్గొన్నాడు. ‘ఎంత సక్కనిదమ్మ/ మా ఇంటి తెలుగు/ ఎంత కమ్మనిదమ్మ/ మా తల్లి తెలుగు/ అచ్చుల అందాలు పంచినది/ హల్లుల బంధాలు పెంచినది’ అంటూ అందంగా సాగినది. ఈ గేయంలో తెలుగు వెలుగును ఎలుగెత్తి చాటుతారు కవి. ‘పిల్లలం పిల్లలం/ పిలుపుల మల్లెలం/ జల్లులం జల్లులం/ పాటలూరు ఎల్లలం…/ చిర్రగోనె ఆటల తుర్రుపిట్ట రెక్కలం/ గోటీల వరసులో గోలవెట్టే ఈలలం/ కాగితాల పడవలం- ముంజబండ్ల తొవ్వలం/ కాలమింట కన్ను తెలిసి/ తోక మీద గువ్వలం’ అంటూ రాశారు ‘పిల్లలం’ గేయంలో రామ్మూర్తి. మరో గేయం ‘పలకమ్మ’లో ఇలా ‘పలకమ్మ పలకమ్మ జర పలుకమ్మ/ బలపంతో బాసాడే చిలకమ్మ/ అఆలు ఇఈలు ఎఏలు/ కఖలు కికీలు కెకేలు/ కేకుల తినిపించమ్మ/ మా ఆకలి తీర్చాలమ్మ’. ఎంత చక్కని ఆశ, అభ్యర్థన… చదువు అందరికీ అందాలన్న తపన… బాబా సాహెబ్ బాటలో సాగుతున్నవారు కదా! విద్యాదీవెనను కోరడంలో ఆశ్యర్యంలేదు. ఇందులోనే రామ్మూర్తి చంద్రుడిని ‘చుక్కలరాజా!’ అంటూ చక్కనిచుక్క లాంటి గేయం రాశారు. ‘చుక్కలరాజా! చంద్రయ్య/ వెన్నెలనవ్వు నీదయ్య/ చల్లని చూపుల నడకయ్య/ నీవే మాకు మావయ్య’ అంటూనే ‘… ఎంత పిలిచినా రావయ్య/ కోపం ఎందుకు మావయ్య/ మా ఇంటికి నువు రాకుంటే/ మీ ఇంటికి మేమే వస్తాము/ లోకం అంతా చూస్తాము/ నీదగ్గరే మేం ఉంటాం’ అంటారు. ఈ ‘చల్లని’ ఊహ ఎంత బాగుంది… చందమావయ్య దగ్గరికి మనం ఎప్పుడో వెళ్ళాం… ‘తథాస్తు’ మా రామ్మూర్తి అన్నట్టు అక్కడే మనముండే రోజు రావాలని ఎదురు చూస్తున్నాను. బాలగేయాల చందమామయ్య… నల్లగొండ నట్టింట్లో బాలగేయాల దొడ్డి ఈ రామ్మూర్తికి ముందస్తుగా సాల్గిరా ముబారక్! జయహో బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్, 9966229548