వండుకున్న అమ్మకు ఒకటే కూర….

Mother cooked the same curry...వంటలు చేసి వడ్డించడం ఒక శాస్త్రీయ నైపుణ్యత. దీనినే పాకశాస్త్రం అంటారు. అన్నంలో ఏదో ఒక కూర కలుపుకొని తినడం రివాజు. రెండు మూడు కూరలు తినేవాళ్లు గొప్పవాళ్లే. అందుకే ‘వండుకున్నమ్మకు ఒకటే కూర, అడుక్కునే అమ్మకు అనేక కూరలు’ అనే సామెత పుట్టింది. అడుక్కొని తినే వాళ్ళను నిందించినట్టు ఉన్నది గాని ఇది నిజమే. వాళ్లు నాలుగు ఇండ్లలో తిరిగితే నాలుగు కూరలు వస్తాయి. ఉమ్మడి కుటుంబంలో సభ్యులు ఎక్కువగా ఉంటారు. అందులో ఇంటి పెద్దలకు అధిక ప్రాధాన్యతలు ఉంటాయి. అన్నం, కూర వండిన తర్వాత వంట వండిన ఇల్లాలికి గాని, ఆమె కోడలికి కానీ సరిపోయేంత మిగలకపోవచ్చు కూడా. పూర్వ కాలంలో అనుకోని చుట్టాలు కూడా వచ్చేవారు. ‘వండినోళ్ళకే వరి అన్నం మిగలలేనట్టు’ అనే సామెత పుట్టింది. ఆమె వంట తయారు చేస్తది. కానీ ఆఖరికి దొరకదు. అప్పుడు ఏ తొక్కో కలుపుకొని తింటది. వంట సమయంలోనే చుట్టాలు వచ్చి తొందర తొందరగా పోయేవాళ్ళు ఉంటారు. తినమని వంట మొదలు పెట్టిన తర్వాత ‘వండినంతసేపు ఉండి వార్చేలోపు పోయినట్టు’ అనే సామెత పుట్టింది. అన్నం ఉడికిన తర్వాత ఆ కాలంలో అందులో ఉన్న గంజిని వార్చేవారు. తర్వాత పుల్లలు పుల్లలు అయిన అన్నం తింటారు.
కొన్ని కుటుంబాలలో సరదా కోసం ప్రేమగా అలుగుడు ఉంటది. ఆ అలకను మాన్పించే బాధ్యత ఆ కుటుంబంలోని తమ్మునికి ఉంటది. అప్పుడు ఆయన ‘వండుమని అక్కకు మొక్కాలే, తినుమని బావ కాళ్లకు మొక్కాలె’ అని మదన పడుతుంటాడు. ఈ అక్కకు వండాలంటే కూడా కష్టమే. సరియైన టైంకు పొయ్యి ఉండదు. అప్పుడు ఆమె ‘వంట అంతా అయిపోయినంక పొయ్యి మండినట్టు’ అని సమయానికి సరిగా మండని పొయ్యిని నిందిస్తుంది. ఇలా ఇంటి వంటల మీద కూడా బహు సామెతలు ఉంటాయి.

– అన్నవరం దేవేందర్‌, 9440763479