స్నేహమంటే ఒక నులివెచ్చటి స్పర్శ. భాషకందని కమ్మటి భావన. చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల పొదరింట్లో విరిసిన అందమైన గులాబీ. జీవితంలో మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఎప్పుడో చిన్నప్పుడు బుడిబుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహ బంధాలు కొన్నయితే, పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరికొన్ని. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఏ కాలేజీలోనో, లైబ్రరీలోనో, కలిసి నడిచే కారిడార్లోనో, తరగతి గదిలోని ఒకే బెంచిపై, మాస్టారు బోధించే పాఠాల్లోని సందేహాల్లో ఊపిరి పోసుకొనే స్నేహం..ఒక మహావృక్షంలా ఎదుగుతుంది. జీవితంతో మమేకమవు తుంది. ఒక విడదీయరాని అనుబంధమై పోతుంది. అసలు కళాశాల అంటేనే స్నేహితుల కలల కాణచి. సహ విద్యార్థిగా రూపుదిద్దుకొనే పరిచయం..స్నేహమై ఎలా ఎదుగుతుందో, జీవితంలో ఒక తీపి గుర్తుగా ఎలా మిగిలిపోతుందో ఏ డైరీని అడిగినా చెబుతాయి. మదిలో నిక్షిప్తమైన భావాలను, అనుభవాలను, అనుభూతులను పంచుకోవడం తప్ప ఏ స్వార్ధం లేని జీవన బంధం స్నేహం. జీవితంలో ఎవరున్నా, లేకున్నా మంచి నేస్తం ఒకరు తోడుంటే చాలు.
‘దోస్త్ మేర దోస్త్..తు హై మేరీ జాన్..వాస్తవం ర దోస్త్..నువ్వే నా ప్రాణం.. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహ మనే మాటలో చెరో అక్షరం మనం’ అని సినీ కవి అన్నట్టు తారతమ్యాలు లేని అరమరికలు లేని స్నేహం అంతస్తులు మరిచి అంతరంగాలను పంచుకుంటుంది. స్నేహానికి కులం లేదు. మతం అడ్డురాదు. అది చంద్రుని వెన్నెల లాంటిది. వీచే చిరుగాలి వంటిది. జలజలా రాలే సెలయేటి లాంటిది. అవును..అన్ని మతాలకు దోస్తీ సమ్మతమే.
ఓ నిముషం కోపంగా మరునిముషం నవ్వులతో.. మరి కాసేపు ఈర్ష్యతో.. ఇంకాసేపు అనురాగంతో.. జీవితంలో కురిసే రసాలన్నిటినీ రుచిచూపించేదే స్నేహం.అది భవిష్యత్తును కలలు కంటుంది. వర్తమానంలో కలహించుకుంటుంది. గతాన్ని గుర్తుచేసుకొని కంటతడి పెడుతుంది. స్నేహానికి ఉన్న విలువను కాపాడుకొని.. అసూయలను పాతరేసి.. ఈర్ష్యలను వదిలేసి.. కమ్మనైన కలలుకనే మంచి దోస్తు ప్రతి ఒక్కరికి దొరుకుతారు. ఆ సోపతిని జీవితాంతం నిలుపుకోవాలి. అదే స్నేహానికి పరమార్థం. స్నేహానికున్న విలువ వెలకట్టలేనిది. ఈ లోకంలో స్నేహితుడు/ స్నేహితురాలు లేకుండా ఏ వ్యక్తి వుండరు.
ఎన్ని వర్గాలుగా విభజించినా స్నేహితుడు ఎప్పుడు హితుడే. ‘స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నదీ, స్నేహమేరా పెన్నిధీ!’ అన్నాడో సినీకవి. జగత్తులో ఎన్ని బంధాలు, అనుబంధాలు ఉన్నా స్నేహబంధం అనేది మాత్రం మనిషి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. మిగిలిన అన్ని బంధాలు ఏదో రూపంలో మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో ప్రవేశిస్తాయి. కానీ స్నేహబంధం మాత్రం పూర్తిగా మన ఇష్టంతో, మనకు నచ్చిన వారితోనే ఏర్పడుతుంది. స్నేహితుల పట్ల విజ్ఞతతో వ్యవహరించడం చాలా అవసరం. సమయ సందర్భాలను బట్టి మాత్రమే స్పందించాలి. స్నేహితుని లోపాలను ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా, అతని మేలుకోరి సున్నితంగా తెలియజెప్పాలి. నేడు స్నేహం కూడా కృత్రిమమై పోయింది. మొహమాటపు స్నేహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనసు లోతుల నుంచి పెల్లుబికే స్నేహ సంబంధాలు చాలా అరుదు. స్నేహం ముసుగులో మోసం, దగా, వంచన కొనసాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి స్నేహాలను నిజమైన స్నేహాలుగా చెప్పుకోలేము. అవి మంచి స్నేహాలుగా నిలువజాలవు కూడా. పరిచయాలు, అవసరాల మేరకు ఏర్పడ్డ మితృత్వాన్ని నిజమైన స్నేహంతో పోల్చలేము. రెండు భిన్నమైన, వైరుధ్య పూరితమైన భావాలు గలవారి మధ్య స్నేహం చిగురించడం కష్టం. భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ విరుద్ధ దృక్పథాలు స్నేహం చేయలేవు. చేసిన దాఖలాలూ లేవు.
చరిత్రలో చూసుకుంటే భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల స్నేహం, స్వాతంత్య్రం కోసం చేసిన సమరంలో సాగిన స్నేహం. ఇక మానవాళి విముక్తి కోసం జీవితాలను అర్పించిన మార్క్స్, ఎంగెల్స్‌ల స్నేహం ఇప్పటికీ ఆదర్శవంతమైనది. ‘మానవళి చరిత్రలో స్నేహానికి దర్పణం పట్టే అన్ని ఉదాహరణలను అధిగమించే స్నేహితుల ద్వయం’ అని మార్క్స్, ఎంగెల్స్ స్నేహం గురించి లెనిన్ వ్యాఖ్యానిస్తాడు. వారి స్నేహం ఎంత బలమైనదో, వారు దర్శించిన విప్లవక్రమం అంత నిర్మాణాత్మకమైనదని వీరి స్నేహం రుజువు చేస్తుంది. ప్రపంచ మానవాళిని మానవీయంగా తయారు చేయడానికి చేసిన కృషిలో వీరి మైత్రి వెలుగొందింది. అదే విధంగా ఒక దేశంలో విప్లవ సాధనలో ఏర్పడిన మైత్రి ఫిడెల్కాస్ట్రో, చేగువేరాలది. ఇలా ఆశయాలదారుల్లో పరిమళించిన స్నేహాలు మనకెంతో స్ఫూర్తినీ, చైతన్యాన్ని కలిగిస్తాయి. చిరస్మరణీయంగా నిలుస్తాయి. అలాంటి ఆశయాలకు బాటలో సాగే స్నేహం చిరస్మరణీయం.