– కోట్ల ప్రజాధనం వృథా.. పట్టించుకోని అధికారులు
– శిక్షణ ఇవ్వరు..ఉపాధి కల్పించారు
నవతెలంగాణ – నసురుల్లాబాద్
యువతకు స్వయం ఉపాధి కోర్సుల అవసరాలకు నిర్మించిన ప్రభుత్వ భవనం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంది. కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన భవనంకు ఆలనా పాలన కరువవడంతో పక్కా భవనంలో పిచ్చి మొక్కలు , గోడలు దెబ్బతింటున్నాయి. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో 5 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన భవనం ఉత్సాహ విగ్రహం లాగా మారింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృషితో జిల్లాలోనే మొదటి యువత శిక్షణ కేంద్రంను మంజూరు చేయించారు. దీనికి నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఇరిగేషన్ శాఖ కు చెందిన కోట్ల విలువైన భూమిని గిరిజన శాఖకు కేటాహించి 5 కోట్ల రూపాయలతో 2021 లో అదు నూతన భవనం నిర్మించారు. ఇందులో ఉచిత భోజనం తోపాటు ఉచిత శిక్షణ ఇవ్వడం కోసం యువత, యువతిల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి కల్పించారు. కంప్యూటర్ శిక్షణ, ఆరోగ్య కార్యకర్తల శిక్షణ, ఇతర ఎన్నో శిక్షణ కోర్సులు ఉన్నాయి.
అపోలో ఆధ్వర్యంలో..
అపోలో హాస్పిటల్ హైదరాబాద్ వారి అద్వరంలో 2022లో. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం ద్వారా కొందరికి ఆరోగ్య కార్యకర్తల శిక్షణ ఇచ్చారు. తదుపరి వారికి హైదారాబాద్ లో శిక్షణ ఇస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు శిక్షణ నిర్వాహకులు తెలిపారు. యువత శిక్షణ కేంద్రానికి యువకులు ఆసక్తి చూపక పోవడంతో మూడు మసాలకే అపోలో హాస్పిటల్ వారు నిష్క్రమించారు. ఇప్పటికీ నూతన భవనంలో శిక్షణ కోసం తెచ్చిన ప్రయోగం శాలలు, కంప్యూటర్ ల్యాబ్ ఇతర ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ నిధులతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న నూతన భావనలకు ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం , కింది స్థాయి ఉద్యోగులు ప్రభుత్వ భవనాలపై ఆసక్తి చూపడంలేదు. దాంతో ఆ భవనాలు కూడా పాడైపోతున్నాయి. ఇలా ప్రభుత్వ భవనాలకు ఆలనా పాలన కరువవడంతో శిథిలావస్థకు చేరాయి.
కొత్త భవనాలు లేక ఇబ్బందులు..
నసురుల్లాబాద్ మండలంలో జూనియర్ కళాశాల, ప్రభుత్వ మోడల్ స్కూల్, ప్రభుత్వ కస్తూర్బా ప్రభుత్వ పాఠశాల అవసరం ఉండగా, ప్రస్తుతం ఉన్న పోలీస్ స్టేషన్ కు ప్రభుత్వ ఆసుపత్రికి, మహిళ శక్తి భవనం, వ్యవసాయ శాఖ కార్యాలయంకు పక్క భవనాలు లేవు. అద్దె భవనాల్లో ఉండి ఇరుకు గదుల్లో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించాలి
గ్రామానికి అనుకొని ఉన్న ఇరిగేషన్ శాఖ కు చెందిన కోట్ల విలువైన భూమిని యువత శిక్షణ కోసం గిరిజన శాఖకు కేటాయించారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోట్లాది రూపాయలతో నిర్మించిన నూతన భవనం నిరుపయోగంగా మారింది. ఈ శిక్షణ కేంద్రంలో ఎవరు లేక పోవడంతో భుత్ బంగ్లా లాగా మారింది. ప్రజల అవసరాల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలు కొన్ని కారణాలతో మూతపడ్డాయి. ఆ భవనాలను అలాగే వదిలేయకుండా ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించాలని పలువురు కోరుతున్నారు. ఉన్న భవనాలను అలాగే వదిలేస్తే శిథిలమడం తప్పా ఏ మాత్రం ఉపయోగపడవని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏ శాఖకు అవసరమైన వాటిని ఉపయోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. జిల్లా కలెక్టర్ స్పందించి నిరుపయోగంగా ఉన్న భావనలను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.