చక్‌దే ఇండియా!

Chakde India!– ఒలింపిక్‌ సెమీస్‌లో హాకీ ఇండియా
– క్వార్టర్‌ఫైనల్లో బ్రిటన్‌పై ఘన విజయం
– షుటౌట్‌లో 4-2తో భారత్‌ జయకేతనం
– పారిస్‌ 2024 ఒలింపిక్స్‌
పారిస్‌ ఒలింపిక్స్‌ హాకీ క్వార్టర్‌ఫైనల్‌. అగ్రజట్టు గ్రేట్‌ బ్రిటన్‌తో హాకీ ఇండియా అమీతుమీ. హాకీలో రెడ్‌ కార్డ్‌ అత్యంత అరుదు. అటువంటిది స్టార్‌ డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ రెడ్‌కార్డ్‌తో దాదాపుగా మూడు క్వార్టర్ల ఆటకు దూరమయ్యాడు. గోల్స్‌ వేటలో దూకుడుగా ఆడే బ్రిటన్‌తో పది మందితో కూడిన టీమ్‌ ఇండియా అప్రతిహాత విజయం సాధించింది. డిఫెన్స్‌లో గత రెండు దశాబ్దాల్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్‌.. పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఉత్కంఠభరిత షుటౌట్‌లో బ్రిటన్‌పై 4-2తో విజయం సాధించింది. ఇక్కడ్నుంచి భారత్‌ కనీసం ఒక్క విజయం సాధించినా.. వరుస ఒలింపిక్స్‌లో పతకం ఖాయమే!.
నవతెలంగాణ-పారిస్‌
ఒలింపిక్స్‌లో హాకీ ఇండియా దూసుకెళ్తోంది. మూడేండ్ల కిందట టోక్యో ఒలింపిక్స్‌ ప్రదర్శనను పునరావృతం చేసింది. ఆదివారం జరిగిన హాకీ క్వార్టర్‌ఫైనల్లో అగ్ర జట్టు గ్రేట్‌ బ్రిటన్‌పై మెరుపు విజయం సాధించి.. పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నిర్ణీత 60 నిమిషాల ఆటలో గ్రేట్‌ బ్రిటన్‌, భారత్‌లు 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో మ్యాచ్‌ ఫలితాన్ని షుటౌట్‌లో నిర్ణయించారు. ఉత్కంఠగా సాగిన షుటౌట్‌లో భారత్‌ నుంచి వరుసగా నలుగురు ఆటగాళ్లు గోల్స్‌ నమోదు చేయగా.. గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి తొలుత ఇద్దరు గోల్స్‌ కొట్టారు. ఆ తర్వాత రెండు గోల్‌ ప్రయత్నాలను దిగ్గజ గోల్‌ కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ సమర్థవంతంగా నిలువరించాడు. దీంతో 4-2తో భారత్‌ ఘన విజయం సాధించింది. ఆట 17వ నిమిషంలో స్టార్‌ డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌కు రెడ్‌ కార్డ్‌ ఇవ్వటంతో.. అక్కడ్నుంచి భారత్‌ పది మంది ఆటగాళ్లతోనే పోటీపడింది. గ్రేట్‌ బ్రిటన్‌పై గ్రేట్‌ విజయాన్ని అందుకుంది.
సూపర్‌ షో
భారత్‌, గ్రేట్‌ బ్రిటన్‌ క్వార్టర్‌ఫైనల్లో.. హాకీ ఇండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. టోక్యో ఒలింపిక్స్‌లో బ్రిటన్‌ను చిత్తు చేసిన ఉత్సాహంతో హర్మన్‌ప్రీత్‌ సేన ఉత్సాహంగా కనిపించింది. ఊహించినట్టుగానే బంతి నియంత్రణలో బ్రిటన్‌ పైచేయి సాధించింది. 54 శాతం బ్రిటన్‌ నియంత్రణలో ఉండగా.. భారత్‌ 46 శాతమే నియంత్రణలో ఉంచుకుంది. ఎదురుదాడికి బ్రిటన్‌ పెట్టింది పేరు. కానీ భారత ఢిఫెన్స్‌ గత 20 ఏండ్లలో ఎరుగని ప్రదర్శనతో కదం తొక్కింది. బ్రిటన్‌ ఏకంగా 21 సార్లు భారత గోల్‌పోస్ట్‌పై దాడి చేసింది. కానీ గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌ గోడ కట్టాడు. భారత్‌ మాత్రం ఎనిమిది పర్యాయాలు మాత్రమే బ్రిటన్‌ గోల్‌ పోస్ట్‌పై దాడి చేసింది. ఈ క్రమంలో రెండు జట్లు చెరో సారి విజయవంతం అయ్యాయి.
ఆట తొలి 15 నిమిషాల్లోనే గోల్‌ ప్రయత్నాలు జరిగినా.. ఆట సమతూకంగా నిలిచింది. రెండో క్వార్టర్‌లో ఆట ఊహించని మలుపులు తిరిగింది. 17వ నిమిషంలో డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ రెడ్‌ కార్డ్‌ శిక్షకు గురయ్యాడు. దీంతో ఆ తర్వాతి నుంచి భారత్‌ పది మంది ఆటగాళ్లతోనే ఆడింది. 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జంత్‌ సింగ్‌ సద్వినియోగం చేసుకోలేదు. కానీ అదే నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌గా మలిచాడు. దీంతో 22వ నిమిషంలో భారత్‌ 1-0తో ముందంజ వేసింది. కానీ బ్రిటన్‌ ఎంతోసేపు వెనుకంజలో నిలువలేదు. 27వ నిమిషంలో మోర్టాన్‌ లీ ఫీల్డ్‌ గోల్‌తో స్కోరు సమం చేశాడు. ప్రథమార్థం ఆట ముగిసే సమయానికి భారత్‌, బ్రిటన్‌ 1-1తో సమవుజ్జీగా నిలిచాయి.
స్టార్‌ డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ లేని వేళ సహజంగానే గ్రేట్‌ బ్రిటన్‌ ఎదురుదాడిలో పస పెంచింది. ఈ సమయంలో భారత్‌ ఎటాకింగ్‌ను వదిలేసి పూర్తిగా రక్షణ శ్రేణిపై దృష్టి నిలిపింది. సీనియర్‌ మిడ్‌ ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ డిఫెన్స్‌లోకి వచ్చాడు. సెంటర్‌ బ్యాక్‌గా నిలిచాడు. సుమిత్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, జర్మన్‌ప్రీత్‌ సింగ్‌లు సైతం డిఫెన్స్‌లో చేరాడు. వీళ్లందరి వెనుక.. శ్రీజేష్‌ గోడలా నిలబడ్డాడు. బ్రిటన్‌ ఆటగాళ్ల గోల్‌ ప్రయత్నాలను శ్రీజేష్‌ గొప్పగా నిలువరించాడు. మిడ్‌ఫీల్డ్‌లో సుమిత్‌ను బ్రిటన్‌ లక్ష్యంగా చేసుకుంది. అతడి సైడ్‌ పిచ్‌పై దాడి చేయటం మొదలుపెట్టింది. కానీ సుమిత్‌ బ్రిటన్‌ ట్రాప్‌లో పడకుండా.. ప్రతిసారి చక్కగా ప్రతిస్పందించాడు. హార్దిక్‌ సింగ్‌, అభిషేక్‌, సుఖజిత్‌ సింగ్‌, లలిత్‌ కుమార్‌ ఉపాధ్యారులు సైతం డిఫెన్స్‌లో భాగం పంచుకున్నారు. అద్భుత ప్రదర్శనతో 60 నిమిషాల ఆటలో గ్రేట్‌ బ్రిటన్‌ను నిలువరించినా.. అక్కడితో పని పూర్తి కాలేదు.
హీరో.. శ్రీజేష్‌
గ్రేట్‌ బ్రిటన్‌తో క్వార్టర్‌ఫైనల్లో భారత డిఫెన్స్‌ అమోఘం. డిఫెన్స్‌ నాయకుడు శ్రీజేష్‌ ఈ విజయంలో హీరో. కెరీర్‌ చివరి టోర్నమెంట్‌లో ఆడుతున్న శ్రీజేష్‌.. గోల్‌ పోస్ట్‌ ముందు వంద శాతం ప్రదర్శన ఇస్తున్నాడు. మ్యాచ్‌ షుటౌట్‌లోకి వెళ్లగా.. శ్రీజేష్‌ భారత్‌ను విజేతగా నిలిపాడు. తొలి రెండు ప్రయత్నాల్లో అల్బరీ జేమ్స్‌, జాక్‌లు గోల్స్‌ కొట్టారు. కానీ ఆ తర్వాత వరుసగా విలియమ్సన్‌ కానర్‌, రాఫర్‌ ఫిలిప్‌లను అడ్డుకుని భారత్‌ను విజయ సంబురాల్లో ముంచెత్తాడు. షుటౌట్‌లో భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, సుఖజిత్‌ సింగ్‌, లలిత్‌ కుమార్‌ ఉపాధ్యారు, రాజ్‌కుమార్‌ పాల్‌లు గోల్స్‌ కొట్టారు.
రెడ్‌ కార్డ్‌ వివాదం!
ఫీల్డ్‌ హాకీలో రెడ్‌ కార్డ్‌ అత్యంత అరుదు. హాకీలో ఏ ఆటగాడు సైతం రెడ్‌ కార్డ్‌ ఎదుర్కొకుండా గేమ్‌ను డిజైన్‌ చేశారు. రెండు నిమిషాల సస్పెన్షన్‌కు గ్రీన్‌ కార్డ్‌, ఐదు నిమిషాల సస్పెన్షన్‌కు ఎల్లో కార్డ్‌ జారీ చేస్తారు. మరీ తీవ్ర తప్పిదంగా భావిస్తే పది నిమిషాల సస్పెన్షన్‌కు సైతం ఎల్లో కార్డ్‌ను రిఫరీ వాడతారు. ప్య్రతర్థి ఆటగాడికి గాయపరచాలనే కచ్చితమైన ఉద్దేశంతో ఆడితేనే రెడ్‌ కార్డ్‌ చూపిస్తారు. కానీ అమిత్‌ రోహిదాస్‌కు రిఫరీ రెడ్‌ కార్డ్‌ చూపించారు. 17వ నిమిషంలో రోహిదాస్‌.. బ్రిటన్‌ ఆటగాడు విలియమ్‌ కాల్నన్‌ ముఖం మీదుగా బంతిని కొట్టాడు. దీంతో రిఫరీ అమిత్‌ రోహిదాస్‌కు రెడ్‌ కార్డ్‌ అందించాడు. ఇక ఆ నిమిషం నుంచి భారత్‌ మైదానంలో పది మందితోనే ఆడింది. అమిత్‌కు రెడ్‌ కార్డ్‌ నిర్ణయం విశేష చర్చకు దారితీసింది. కానీ అమిత్‌ లేకపోవటంతో.. హాకీ ఇండియా రెట్టింపు జాగ్రత్త, డిఫెన్స్‌తో ఆడింది. పది మందితో అద్భుత విజయం అందుకుంది.
పోరాడి ఓడిన లక్ష్యసేన్‌
బ్యాడ్మింటన్‌లో పతక ఆశలు రేపిన యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ సెమీఫైనల్లో పోరాడి ఓడాడు. టాప్‌ సీడ్‌, డిఫెండింగ్‌ ఒలింపిక్‌ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌)తో సెమీస్‌ పోరులో లక్ష్యసేన్‌ వరుస గేముల్లో ఓటమి చెందాడు. 54 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 20-22, 14-21తో పరాజయం పాలయ్యాడు. ఉత్కంఠగా సాగిన తొలి గేమ్‌లో లక్ష్యసేన్‌ పట్టు విడువలేదు. ఆఖరు వరకు విక్టర్‌ను వెంటాడాడు. కానీ రెండో గేమ్‌లో చాంపియన్‌ విక్టర్‌ తన క్లాస్‌ చూపించాడు. మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో ఓడినా.. లక్ష్యసేన్‌ మెడల్‌ రేసులోనే నిలిచాడు. మరో సెమీఫైనల్లో పరాజయం పాలైన మలేషియా ఆటగాడు జియా లీతో కాంస్య పతక మ్యాచ్‌లో పోటీపడనున్నాడు.
ఇదిలా ఉండగా, బాక్సింగ్‌లో భారత పతక వేటకు తెర పడింది. టోక్యో ఒలింపిక్‌ మెడలిస్ట్‌ లవ్లీనా బొర్గొహైన్‌ క్వార్టర్‌ఫైనల్లో ఓటమి చెందింది. క్వార్టర్‌ఫైనల్లో విజయంతో లవ్లీనా కనీసం కాంస్యం ఖాయం చేసుకునేది. కానీ చైనా బాక్సర్‌ లి క్వియన్‌ చేతిలో లవ్లీనా ఓటమి చెందింది.
షుటౌట్‌లో ఎవరెలా (బ్రిటన్‌ 2-4 భారత్‌)
ఆల్బరీ జేమ్స్‌ (1-0) (బ్రిటన్‌)
హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (1-1)
వాల్లాస్‌ జాక్‌ (2-1) (బ్రిటన్‌)
సుఖ్‌జిత్‌ సింగ్‌ (2-2)
విలియమ్సన్‌ కోనర్‌ (2-2) (బ్రిటన్‌)
లలిత్‌ కుమార్‌ (2-3)
రోపర్‌ ఫిలిప్‌ (2-3) (బ్రిటన్‌)
రాజ్‌కుమార్‌ పాల్‌ (2-4)