– బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్, షూటింగ్‌లో మహేశ్వరి-అనంత్ జోడీకి నిరాశే
– నాల్గో స్థానంతో దూరమైన కాంస్య పతకాలు
– పారిస్ 2024 ఒలింపిక్స్
యువ షట్లర్ లక్ష్యసేన్ ఆశలు ఆవిరయ్యాయి. మెన్స్ సింగిల్స్‌లో చారిత్రక ఒలింపిక్ మెడల్‌పై కన్నేసిన లక్ష్యసేన్.. కాంస్య పతక పోరులో పోరాడి ఓడాడు. దీంతో మూడు ఒలింపిక్స్ తర్వాత తొలిసారి భారత్ బ్యాడ్మింటన్‌లో పతకం లేకుండా నిష్క్రమించింది!. షూటింగ్‌లో మహేశ్వరి, అనంత్ జోడీకి సైతం భంగపాటు తప్పలేదు. స్కీట్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్‌లో మన జోడీ స్వల్ప తేడాతో పతకం చేజారింది. బ్యాడ్మింటన్, షూటింగ్‌లో నాల్గో స్థానంలో నిలువటంతో భారత్ రెండు కాంస్య పతకాలు చేజార్చుకుంది.
నవతెలంగాణ-పారిస్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధిస్తుందని అనుకుంటే.. సోమవారం భంగపాటు తప్పలేదు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక మ్యాచ్‌లో యువ షట్లర్ లక్ష్యసేన్ పోరాడి ఓడాడు. మలేషియా షట్లర్, ఏడో సీడ్ లీ జి జియతో ఉత్కంఠ మ్యాచ్‌లో 1-2తో పరాజయం పాలయ్యాడు. షూటింగ్‌లో మహేశ్వరి చౌహాన్, అనంత్ జీత్ సింగ్ జోడీ సైతం నిరాశపరిచింది. స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో నాల్గో స్థానంతో సరిపెట్టుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ షూటింగ్‌లో నాల్గో స్థానానికి పరిమితం కావటం మూడోసారి. మను బాకర్, అర్జున్ బబుత సైతం తమ విభాగాల్లో నాల్గో స్థానంలో నిలిచి మెడల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయారు.
లక్ష్యసేన్.. పోరాడినా! : పురుషుల సింగిల్స్ (బ్యాడ్మింటన్)లో లక్ష్యసేన్ పతక ఆశలు ఆవిరి అయ్యాయి. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె స్వయంగా లక్ష్యసేన్‌కు శిక్షకుడిగా బరిలోకి దిగటంతో అంచనాలు అమాంతం ఎక్కువైయ్యాయి. ఏడో సీడ్ మలేషియా షట్లర్ లీ జి జియపై లక్ష్యసేన్ దూకుడుగా ఆడాడు. 71 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-13తో తొలి గేమ్‌ను అలవోకగా సొంతం చేసుకున్నాడు. 20 నిమిషాల్లోనే మలేషియా షట్లర్‌పై పైచేయి సాధించాడు. కానీ రెండో గేమ్‌లో మలేషియా షట్లర్ పుంజుకున్నాడు. లక్ష్యసేన్‌ను 21-16తో వెనక్కి నెట్టి స్కోరు సమం చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో లక్ష్యసేన్ అంచనాలను అందుకోలేదు. 11-21తో లీ జి జియ ముందు తేలిపోయాడు. చివరి రెండు గేములు 26 నిమిషాలు సాగాయి. లక్ష్యసేన్ ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం దక్కలేదు. మెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) 21-11, 21-11తో కునాల్ (థారులాండ్)పై విజయం సాధించాడు.
మరోసారి గురి తప్పింది : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు కాంస్య పతకాలు దక్కగా.. షూటర్లే ఆ ఘనత సాధించారు. పలు క్రీడాంశాల్లో భారత్ మెడల్‌కు చేరువగా వచ్చినా గెలుపు గీత తాకలేదు. షూటింగ్‌లో మరో మెడల్ వచ్చినట్టే వచ్చి చేజారింది. స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక రౌండ్‌లో మహేశ్వరి చౌహాన్, అనంత్ జీత్ సింగ్‌లు నిరాశపరిచారు. చైనా షూటర్లు జియాంగ్, జిన్‌లిన్ జోడీ 44-43తో కాంస్య పతకం సొంతం చేసుకుంది. మహేశ్వరి, అనంత్‌లు వరుసగా 7, 6, 7, 7, 8, 8 స్కోరు చేయగా.. చైనా షూటర్లు 8, 5, 7, 8, 8, 8తో మెరిశారు. ఆఖరు మూడు రౌండ్లలో ఫర్‌ఫెక్ట్ 8తో చైనా కాంస్య పతకం సొంతం చేసుకుంది.
నిశ నిష్క్రమణ : రెజ్లింగ్‌లో నిశ దహియ పోరాటం ముగిసింది. మహిళల 68 కేజీల విభాగం క్వార్టర్‌ఫైనల్లో ఉత్తర కొరియా రెజ్లర్ గమ్ పాక్ చేతిలో పరాజయం పాలైంది. 18 ఏండ్ల పాక్ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న అతి పిన్న వయస్కురాలైన రెజ్లర్. క్వార్టర్‌ఫైనల్ దంగల్‌లో 4-0తో ముందంజలో నిలిచిన నిశ దహియ.. ఆఖర్లో విలవిల్లాడింది. నిశ కుడి కాలును పట్టుకుని టేక్‌డౌన్ చేసిన పాక్ తిరుగులేని పైచేయి సాధించింది. నొప్పితో నిశ కన్నీంటి పర్యంతమైంది. ఉత్తర కొరియా అమ్మాయి ఈ విభాగం సెమీఫైనల్లోకి ప్రవేశించింది.