ఇసుక అక్రమ మైనింగ్‌పై వివరణ ఇవ్వండి

– రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ – హైదరాబాద్‌
కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలంలో ఇసుక అక్రమ మైనింగ్‌పై తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అక్రమ ఇసుక మైనింగ్‌ అరికట్టడానికి తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాథే, జస్టిస్‌ శ్రీనివాస్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భూగర్భ, గనుల శాఖ, రెవెన్యూ, హోం, రవాణా శాఖల ముఖ్యకార్యదర్శులు, గనుల శాఖ ఎండీ, సహాయ డైరెక్టర్‌, కామారెడ్డి కలెక్టర్‌, ఎస్పీ, బిచ్చుకుంద తహసిల్దార్లు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రయివేటు వ్యక్తులతో అధికారులు కుమ్మక్కు కావడంతో యధేచ్చగా అక్రమ మైనింగ్‌ జరుగుతోందంటూ కామారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ ప్రకాష్‌ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా మలిచి విచారణ చేపట్టింది.
కొత్తపల్లిలో గ్రానైట్‌ పరిశ్రమలపై పిల్‌
కరీంనగర్‌ జిల్లా బావోపేట్‌ కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌ గ్రామంలో గ్రానైట్‌ క్వారీలతో పరిసరాల కాలుష్యంపై తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాలుష్యం కారణంగా పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ డాక్టర్‌ డి అరుణ్‌కుమార్‌ హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాథే, జస్టిస్‌ శ్రీనివాస్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శులు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, గనుల శాఖ సహాయ డైకెక్టర్‌, పర్యావరణ ఇంజినీరు, కొత్తపల్లి తహసిల్దార్లకు నోటీసులు ఇచ్చింది. విచారణను వాయిదా వేసింది.