స్పీకర్‌ నిర్ణయం తర్వాతే న్యాయ సమీక్ష

– పార్టీ ఫిరాయింపులపై ఏజీ
నవతెలంగాణ – హైదరాబాద్‌
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఏజీ వాదిస్తూ, స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయడానికి వీల్లేదన్నారు. స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నాకే కోర్టులు వాటిపై విచారణకు వీలుందని సుప్రీంకోర్టు ఉత్తర్వుల గురించి చెప్పారు. స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయోచ్చంటూ పిటిషనర్ల న్యాయవాది మోహన్‌రావు చెప్పారు. ఖైరతాబాద్‌, భద్రాచలం, స్టేషన్‌ ఘన్‌పూర్‌ల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలిచిన దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా వేసిన పిటిషన్లను జస్టిస్‌ బి విజయసేన్‌రెడ్డి సోమవారం విచారించారు. పిటిషన్‌ వేసి నెల రోజులు దాటిందని ఇప్పటికీ స్పీకర్‌ నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
పత్రికల అక్రిడేషన్ల వర్గీకరణ రద్దు : హైకోర్టు
పత్రికల్లో పనిచేసే జర్నలిస్ట్‌లకు అక్రిడేషన్‌ కార్డుల జారీ విషయంలో 2016లో జారీ చేసిన జీవోను సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు తీర్పు చెప్పింది. చిన్న పత్రికల జర్నలిస్టులకు అక్రిడేషన్‌ కార్డుల విషయంలో ఏబీసీడీలుగా విభజన చేయడాన్ని తప్పుపట్టింది. జీవో 230లో కొంత మేరకు రద్దు చేసింది. రెండు నెలల్లోగా చిన్న పత్రికలకూ అక్రిడేషన్‌ కార్డుల జారీకి మార్గదర్శకాలను జారీ చేయాలని ఆదేశించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన టి కృష్ణ ఇతరుల పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఆలోక్‌ ఆరాదే, జస్టిస్‌ జె శ్రీనివాసరావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ పై విధంగా తీర్పు చెప్పింది.