లండన్‌లో హైదరాబాద్‌ యువతి హత్య

మరో యువతికి తీవ్రగాయాలు
నవతెలంగాణ-తుర్కయాంజల్‌
లండన్‌లో హైదరా బాద్‌కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన యువతి కుటుంబసభ్యులకు తీవ్ర మనోవేదనను మిగిల్చింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌ మున్సిపాల్టీ బ్రహ్మణపల్లికి చెందిన కొంతం శ్రీనివాస్‌ రెడ్డి, రమాదేవి దంపతులకు కూతురు తేజస్విని (23), కుమారుడు పవన్‌ కుమార్‌ రెడ్డి ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. కుమారుడు ఆస్ట్రేలియాలో ప్రయివేటు ఉద్యోగం చేస్తుండగా కూతురు తేజస్విని రెడ్డి ఎంఎస్‌ చేయడానికి రెండున్నర సంవత్సరాల క్రితం లండన్‌ వెళ్లింది. లండన్‌లోని గ్రీన్‌ విచ్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ పూర్తి చేసింది. ఇటీవలే స్వదేశానికి తిరిగి రావాల్సి ఉండగా కొన్ని కారణాల దృష్ట్యా ఆమె రాలేకపోయింది. అయితే లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో నివసిస్తున్న ఆమెపై ఎదురు ఫ్లాట్‌కు చెందిన ఓ బ్రెజిలియన్‌ కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె మృతి చెందింది. అడ్డువచ్చిన జనగామకు చెందిన అఖిలకు తీవ్రగాయాలు అయ్యాయి. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే నిందితుడు ఆ అపార్ట్‌మెంట్‌లోకి వారం రోజుల క్రితమే వచ్చినట్టు తెలిసింది. కాగా, హత్య విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లో సంప్రదించారు. మృతదేహాన్ని త్వరలోనే స్వగ్రామం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ సత్తు వెంకట రమణా రెడ్డి, తదితరులున్నారు.