– కుక్కలు పందుల తిష్ట, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా
– పట్టించుకునే వారు కరువు
నవతెలంగాణ కమ్మర్ పల్లి
సొంత భవనాలు లేక అద్య భవనాలు అవస్థలు పడుతున్న వైనాలు ఒక పక్క అయితే… నిక్షేపమైన సొంత భవనాలు నిరుపయోగంగా మారిపోతున్న పట్టింపు లేని నిర్లక్ష్యం మరోవైపు పలు ప్రభుత్వ శాఖల్లో సర్వసాధారణంగా మారింది. కమ్మర్పల్లి మండల కేంద్రంలో రూ. 80 లక్షల వ్యాయామంతో నిర్మించి నిరుపయోగంగా వదిలేసిన ఎస్సీ హాస్టల్ సొంతభవనం ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది..
నిర్మాణం జరిగి చాలా కాలం గురుకుల పాఠశాలగా కొనసాగిన ఈ భవనం ఆరేండ్లుగా మూలనపడి కుక్కలు, పందులు, పశువులు, పారిశుద్ధ్య లోపానికి నిలయంగా… అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. ఇదే అదనుగా కొందరు ఆకతాయిలు ఈ వసతి గృహాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మలుచుకొని కార్యకలాపాలు కొనసాగిస్తుంటే…. మరికొందరు చేతివాటం ప్రదర్శిస్తూ భవనం గదుల్లో ఉన్న విద్యుత్ పరికరాలు, తలుపులు కిటికీలు ఊడదీసి ఎత్తుకుపోయారు.నిక్షేపమైన భవనాన్ని వినియోగంలోకి తెచ్చుకునే అవకాశం ఉన్న అధికారులు ఆ మేరకు దృష్టి సారించకపోవడం విచారకరం. 2013-14 సంవత్సరంలో కమ్మర్ పల్లిలో జాతీయ రహదారికి సమీపంలో తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్లో కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీఎస్పీ నిధులు రూ.80 లక్షలతో ఎస్సీ బాలుర వసతి గృహం కోసం సొంత భవనం నిర్మించారు. విశాలమైన 8 గదులతో నిర్మించిన ఈ భవనాన్ని జులై 7, 2015లో బాల్కొండ శాసన సభ్యులుగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కొంతకాలం వరకు ఎస్సీ బాలుర వసతిగృహం ఈ భవనంలో కొనసాగింది. 2017లో బాల్కొండ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలంలోని మానాలకు గిరిజన బాలికల గురుకుల పాఠశాల మంజూరు అయ్యింది.

ఎస్సీ హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉండడంతో అందులోని తలుపులు, కిటికీలు దొంగలు ఎత్తుకెళ్లారు. కిటికీల అద్దాలను పగలగొట్టి, కిటికీ గోడల్లో ఉన్న ఇనుప చూవ్వలను ఊడబీకి మరీ ఎత్తుకెళ్లారు. ఆకతాయిలు రాత్రి వేళల్లో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చుకుంటున్నారు. భవనంలోని వరండా అంత పగుళ్లు వచ్చి శిథిలంగా మారింది. వర్షాలు కురుస్తుండడంతో భవనం లోపల, బయట భవనం చుట్టూ అడుగుమేర వర్షపు నీరు చేరి ప్రస్తుతం భవనంలోకి వెళ్లే మార్గం లేకుండా పోయింది.ఇప్పటికే భవనం మెట్లు పగుళ్లు ఏర్పడి కూలిపోతున్నాయి. అధికారులు నిర్లక్ష్యం వీడకపోతే రాబోయే రోజుల్లో భవనం పూర్తిస్థాయిలో శిథిలంగా మారే అవకాశం ఉంది.సోషల్ వెల్ఫేర్ శాఖ ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు దృష్టి సారించి సమన్వయంతో భవనాన్ని ఉపయోగంలోకి తేవాలని ప్రజలు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.