సమం చేస్తారా?

– 1-1పై టీమ్‌ ఇండియా గురి
– సిరీస్‌ విజయంపై లంకేయుల కన్ను
– భారత్‌, శ్రీలంక మూడో వన్డే నేడు
– మధ్యాహ్నం 2.30 నుంచి సోనీస్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-కొలంబో : రోహిత్‌ శర్మ, గౌతం గంభీర్‌ తొలి పరీక్షలోనే కఠిన సవాల్‌కు సిద్ధమయ్యారు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచిన భారత్‌.. సిరీస్‌ సమం చేసేందుకు ఆఖరు వన్డేలో బరిలోకి దిగుతోంది. నేడు సైతం లంకేయుల మాయజాలానికి విలవిల్లాడితే టీమ్‌ ఇండియా సుదీర్ఘ విరామం తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్‌ను కోల్పోనుంది. మహిళల జట్టు భారత్‌పై విజయంతో ఆసియా కప్‌ను సొంతం చేసుకోగా.. అసలంక సేన సైతం వన్డే సిరీస్‌ విజయంతో స్వదేశంలో సంబురాలకు తెరలేపాలని ఎదురుచూస్తున్నాడు.
కోహ్లి రాణించేనా? : విరాట్‌ కోహ్లి పేలవ ఫామ్‌ భారత్‌కు ఆందోళనగా మారింది. గత 15 ఇన్నింగ్స్‌ల్లో (అన్ని ఫార్మాట్లలో) కోహ్లి కేవలం ఒకే ఒక్క అర్థ సెంచరీ సాధించాడు. విరాట్‌ కోహ్లి ఫామ్‌ కోల్పోయినట్టు కనిపించటం లేదు. క్రీజులో మంచి టచ్‌తో పరుగులు సాధిస్తున్నాడు. కానీ ఇన్నింగ్స్‌ నిర్మించేలోపే వికెట్‌ కోల్పోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌, ఇప్పుడు శ్రీలంక టూర్‌.. ఓ మెగా ఇన్నింగ్స్‌ బాకీ పడిన విరాట్‌ కోహ్లి నేడు కీలక మ్యాచ్‌లో పరుగుల వరద పారిస్తాడని జట్టు మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. టాప్‌ ఆర్డర్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో కదం తొక్కుతున్నాడు. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలవాల్సిన అవసరం ఉంది. గిల్‌, రోహిత్‌లకు విరాట్‌ తోడైతే.. నేడు మూడో వన్డేలో టీమ్‌ ఇండియా ఉప్పెనను కాచుకోవటం శ్రీలంకకు కష్టసాధ్యమే. మిడిల్‌ ఆర్డర్‌లో గౌతం గంభీర్‌ విశ్వాసం పొందిన శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ అంచనాలను అందుకోవటం లేదు. నాణ్యమైన బ్యాటర్లు ఇద్దరూ తేలిపోవటంతో స్వల్ప లక్ష్యాలను సైతం టీమ్‌ ఇండియా ఛేదించటంలో విఫలమైంది.