అక్రమంగా దండుకున్న ఫీజులను తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు చెల్లించాలి..

Fees charged illegally should be paid back to the parents of the students.– ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
విద్యను సరుకుగా మార్చిన ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోని, అక్రమంగా దండుకున్న ఫీజులను తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు చెల్లించి,వాటిని సీజ్ చేయాలని పిడిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు డిమాండ్ చేశారు.బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..విద్యను వ్యాపారంగా మార్చుకొని దోపిడీకి కేంద్రంగా జిల్లాను ఎంచుకున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను,వారి తల్లిదండ్రులను ఫీజుల పేరుతో పీడిస్తున్నాయి.విద్యపై 5 శాతం లాభాలు మించకూడదనే నిబంధనను పట్టించుకోకుండా  పైపై మెరుగులు దిద్ది, అంగు,ఆర్భాటాలతో  చదువు పేర ప్రత్యేక నిబంధనలు పెట్టుకొని అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తున్నాయి అని అన్నారు. కనీస వసతులు కల్పించకుండా అర్వత లేని టీచర్లను పెట్టి ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నాయి అని మండిపడ్డారు.అంగన్వాడి కేంద్రాల్లో ఆడుతూ చదవాల్సిన పిల్లలను పాఠశాలలో చేర్చుకుంటు చిన్నారుల భవిష్యత్తును ఆగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కమర్షియల్ కాంప్లెక్స్, నివాస గృహాలలో చిన్న చిన్న గదుల్లో వెంటిలేషన్ లేకుండా కిడ్స్ పాఠశాలలు ఏర్పాటు చేసి చిన్నారులను బంధించి,వీరి ధన దాహానికి చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. మరోవైపు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతు నకిలీ పత్రాలు సృష్టించి అర్వత లేని డ్రైవర్లను పెట్టి నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దోపిడీకి పాల్పడుతున్న విద్యాసంస్థల యాజమాన్యాలతో విద్యాశాఖ అధికారులు అండగా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై డీఈవో నీ ఎన్నిసార్లు సంప్రదించినా కనీసం నోరు మెదపడం లేదు అని అన్నారు.అధికారుల అండదండలు చూసుకొని మాకు అడ్డులేదని బహిరంగంగా చెప్పుకుంటూ విద్యాసంస్థలు నిస్సిగ్గుగా విద్య పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి అని తెలిపారు. ఇందులో ఐఐటి,జేఈఈ అంటూ రకరకాల పేర్లతో లక్షలాది రూపాయలు  బలవంతంగా వసూలు చేస్తున్నారని అన్నారు. జీవో ఎంఎస్ 1 ని తుంగలో తొక్కి పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారాలు, షూ, బెల్ట్, టై, బ్యాగ్ లు తమ వద్ద కొనాలని డిమాండ్ చేస్తూ వేలాది రూపాయలను విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారు.అదనంగా ఫీల్డ్ ట్రిప్, ప్రాజెక్టు వర్క్, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాల తో పాటు ఇతర కారణాలు చూపి వేలల్లో వసూలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటికి ఎక్కడ రశీదులు ఉండవు అని పూర్తి ఆధారాలతో విద్యార్థి సంఘాలు డీఈవో దృష్టికి తీసుకువెళ్తే స్పందించడం లేదు అని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వసతులు పాటించకుండా కనీస అర్వత లేని టీచర్లతో నడుపుతున్న ప్రైవేట్ , కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడి పై కలెక్టర్  విచారణ జరిపించి,అక్రమంగా దోపిడీ చేసి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి బలవంతంగా వసూలు చేసిన  ఫీజులను తిరిగి చెల్లించాలి,ఈ దందాను అరికట్టి యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి,వాటి గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిడిఎఫ్ జిల్లా కన్వీనర్ మరికంటి హరీష్, నాయకులు జీ శ్యామ్, అజయ్ కుమార్, సాయి, వేల్పుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.