గ్రామ పంచాయతీలకు నిధులివ్వండి

– ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్‌రావు వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు కేటాయించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా గ్రామాలకు నయా పైసా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాల పేర్లు మార్చడం తప్ప రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదని ఆక్షేపించారు. గతంలో తాము ప్రవేశ పెట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలను పేరు మార్చి స్వచ్ఛదనం, పచ్చదనం పేరుతో ఆగస్ట్‌ 5 నుంచి 9వరకు మొక్కుబడిగా నిర్వహించారని విమర్శించారు. ఒహెచ్‌ఆర్‌ఎస్‌ క్లీనింగ్‌, తాగునీటి పైపుల బాగు లాంటి పనులను చేపట్టాలని ఆదేశాలిచ్చిన సర్కార్‌ వాటికి నిధులను కేటాయించలేదని ఆరోపించారు. బ్లీచింగ్‌ పౌడర్‌, ఆయిల్‌ బాల్స్‌, ట్రాక్టర్లకు డీజిల్‌, కరెంట్‌ బుగ్గల కోసం గ్రామ ప్రత్యేక అధికారులు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టారని తెలిపారు. ఖర్చు పెట్టిన డబ్బులు వస్తాయో రావో అనే ఆందోళన వారిలో నెలకొందని పేర్కొన్నారు. గ్రామాలకు నిధులు కేటాయించక పోవడంతో పనులు జరగక చెత్తకుప్పలుగా మారాయని విమర్శించారు. డెంగీ, మలేరియా జ్వరాలు పెరుగుతున్నా దవాఖానాల్లో మందులు, పడకలు లేవని ఆరోపించారు. గత పదేండ్లలో హరితహారం పండగలా సాగేదని గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఉపాధి హామీ, హెల్త్‌ మిషన్‌ వంటి పథకాల కింద వచ్చిన రూ. 2,100 కోట్లను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్లించారని విమర్శించారు.