డెల్‌లో 12,500 ఉద్యోగులపై వేటు

న్యూయార్క్‌ : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం డెల్‌ తన 12,500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ సంఖ్య మొత్తం సంస్థ ఉద్యోగుల్లో 10 శాతానికి సమానం కావడం ఆందోళనకర అంశం. తొలగింపుల విషయాన్ని ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ ఎగ్జిట్‌ మీటింగ్‌లో తెలిపారు. దీంతో గడిచిన 15 నెలల్లో రెండవసారి ఉద్వాసనలు చేపట్టినట్లయ్యింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉద్దేశించిన విస్తృత పునర్‌వ్యవస్థీకరణలో ఈ తొలగింపులను చేపట్టామని డెల్‌ గ్లోబల్‌ సేల్స్‌ అండ్‌ కస్టమర్‌ ఆపరేషన్స్‌ ప్రెసిడెంట్‌ బిల్‌ స్కానెల్‌, గ్లోబల్‌ ఛానెల్స్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ బైర్న్‌ మెమో తెలిపారు. ఉద్యోగుల తొలగింపులు బాధాకరమే అయినప్పటికీ భవిష్యత్‌ వృద్ధి కోసం అనివార్యంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. డెల్‌ గడిచిన ఆర్థిక సంవత్సరంలోనూ దాదాపు 13,000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుత తొలగింపులతో డెల్‌ వర్క్‌ఫోర్స్‌ 1.2 లక్షల నుంచి లక్ష ఉద్యోగులకు దిగువకు తగ్గనుంది.