శిస్తు(క్ష)ల ‘వికసిత భారత్‌’

Sistu(Ksha)'s 'Developed India'‘ఒక దేశం – ఒక పన్ను’ నేటి కేంద్ర ప్రభుత్వ నినాదం. వస్తుసేవల ఒకే కేంద్ర పన్ను (జి.యస్‌.టి.) చట్టాన్ని, మరో స్వాతంత్ర వేడుకలా 2017 జులై 1 అర్ధరాత్రి నుండి 5, 12, 18, 28 శాతాల పన్నుతో అస్తవ్యస్తంగా అమలు చేసింది.1,300 వస్తువులను, 500 సేవలను ఈజాబితాలో చేర్చింది. ఉమ్మడి జాబితా అంశాలరాష్ట్రాల పన్ను వాటాను, రాష్ట్రాల జాబితా అంశాల పన్నును కేంద్రమే వసూలు చేస్తుంది.ఏది వస్తువు, ఏది సేవ,ఏ వస్తువుపై, ఏ సేవపై పన్ను వేయాలి అన్న అంశాలపై కార్పొరేట్‌ అవగాహనను పాటించింది.
నిత్య జీవితావసరాల సరఫరాతో పాటు ప్రజల చదువులు, ఆరోగ్యం, రోగనిరోధం, వైద్యం, చికిత్స ప్రభుత్వాల బాధ్యత. బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకున్నాయి. వీటి ఖర్చులను 99శాతం ప్రజలు భరించలేరు. ఈ భద్రతారంగ వ్యాపారమే బీమా. ప్రభుత్వరంగ బీమా సంస్థలు తక్కువ ప్రీమియంతో ఎక్కువ సౌకర్యాలు అందిస్తాయి. లాభాల నుండి దేశాభివృద్ధికి నిధులిస్తాయి. బీమా రంగ లాభాలను దోచు కోటానికి ప్రయివేటు బీమా సంస్థలు పుట్టాయి. వస్తువాహనాల భద్రత బాధ్యత కూడా ప్రభుత్వాలదే. వస్తువులకు, వాహనాలకు నష్టం చేయని ప్రమాద నివారణ జాగ్రత్తలను, సౌకర్యాల కల్పనలను ప్రభుత్వాలు చేపట్టాలి. ప్రజారోగ్యం, వస్తు వాహనాల భద్రతలను కాపాడలేని ప్రభుత్వాలే బీమా ఖర్చులను భరించాలి. ప్రభుత్వాలు ఈ ఖర్చులను ప్రజలపైనే రుద్దుతున్నాయి. స్పృహ జాగ్రత్తలు తెలిసినవారే జీవిత, వస్తు వాహనాల బీమా చేసుకుంటారు. బీమా వస్తువూ కాదు, సేవా కాదు. ప్రభుత్వాలు వదిలేసిన బాధ్యత. ప్రజలు మోస్తున్న బరువు. వీటిపై జీఎస్టీ విధించకూడదు.మోడీ సర్కారు జీవిత, ఆరోగ్య బీమా ప్రీమి యంపై 18శాతం జీఎస్టీ విధించింది.ఏ దేశంలోనూ బీమాపై ఇంత పన్ను లేదు. దీనితో మోడీ సర్కారు ఏడాది ఆదాయం 24 వేల కోట్లు. ఒక్క ఆరోగ్య బీమా ప్రీమియంలపైనే 2023-24 ఆర్థిక సంవత్స రానికి 8,263 కోట్లు వసూలయిందని కేంద్రమంత్రి లోకసభకు తెలిపారు.
మన దేశంలో ప్రాథమిక హక్కయిన విద్య ప్రయివేటీకరించబడింది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో కార్పొరేటీకరించబడింది. విద్యార్థులను మార్కుల యంత్రాలుగా, డాలర్ల సంపాదకులుగా మానవత్వం నుండి మనిషితత్వం వైపుగా పాశవిక స్థితికి దిగజార్చుతున్నారు. విద్యాసంస్థల్లో బోధించే విద్య పోటీ పరీక్షలకు పనికిరాదు. పదిరకాల ప్రవేశ పరీక్షలకు కోచింగ్‌ కేంద్రాలు తయారయ్యాయి. 2024కు మూడొంతుల విద్యార్థులకు అనగా పది కోట్ల మందికి ప్రవేశ పరీక్షలు అవసరాలుగానేగాక జీవన విధానంగా మారాయి. ప్రభుత్వాలు ఉపాధి కల్పన నుండి తప్పుకున్నాయి. ఫలితంగా అతి తక్కువ వృత్తి విద్యలకు, ఉద్యోగాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థుల మధ్య పోటీ అనివార్యమయింది. 2015లో రూ.24 వేల కోట్లుగా ఉన్న కోచింగ్‌ మార్కెట్‌ 2022కు రూ.58 వేల కోట్లకు పెరిగింది. 2028కి రూ.1.33 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. మోడీ సర్కారులో ఇది విపరీతంగా పెరిగింది. పిల్లలకు చదువు చెప్పడం ప్రభుత్వాల సామాజిక బాధ్యత. ఇది వస్తుసేవల పరిధిలోకి ఎలా వస్తుంది? 2014కు ముందు విద్యపై జీఎస్టీ లేదు. కోచింగ్‌ కేంద్రాల నుండి కోచింగ్‌ రుసుముల ఆదాయ పన్ను వసూలు చేయాలి. కోళ్లఫారాలుగా నడుపబడుతున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల నుండి ఆదాయ పన్ను వసూలు చేసే ధైర్యం ప్రభుత్వాలు చేయలేవు. చేస్తే పాలక పక్షాల చందాలు, ఎన్నికల ప్రచారం, ఓట్ల సమీకరణ దెబ్బతింటాయి.
విద్యపై 2021లో 2,215 కోట్లు, 2024లో 5,517 కోట్లు18శాతంతో జీఎస్టీ వసూలైంది.మూడేండ్లలో 149శాతం పెరిగింది. 2023-24 విద్యా సంవత్సర లెక్కల ప్రకారం విద్యా సంస్థల నుండి ఉత్తీర్ణులైనవారిలో 51శాతం మాత్రమే ఉద్యోగాలకు పనికి వస్తారు. ఉద్యోగ ప్రావీణ్యతలను పెంచుకోడానికి 2014 కు ముందు జిఎస్టీ లేదు. 2023 లో 18శాతం జీఎస్టీతో ఈ ఖర్చు 34 వేల కోట్లు. విద్యార్థుల ప్రయాణ ఖర్చు, భద్రత సౌకర్యాలు, వసతిగృహాల శుభ్రత, నిర్వహణ ఖర్చు, తిండి పై 18శాతం జీఎస్టీ విధించారు. వీటిపై 2014కు ముందు జీఎస్టీ లేదు. ఎరేజర్లపై 5శాతం, పెన్సిళ్ళు, వాటి ముక్కులు చెక్కే పరికరాలు, జామెట్రి బాక్సులపై 12శాతం జీఎస్టీ, ప్రాథమిక విద్యపై 3శాతం, ఉన్నత విద్యపై 4శాతం ఎడ్యుకేషన్‌ సెస్సు విధిస్తారు. విద్యపై 2024లో 62,250 కోట్ల జీఎస్టీ వసూలైంది. విద్యార్థులు విద్యపై 2024 విద్యా సంవత్సరంలో 26.3 లక్షల కోట్లు ఖర్చుపెట్టారు. ఈ ఖర్చు భరించలేనివారెందరో! ఉత్పాదక శక్తిసామర్థ్యాల దేశ నిర్మాతలు, భావి భారత పౌరులు ఎలా తయారవుతారు? ఇన్ని ఖర్చులతో విద్యను కొన్న విద్యార్థులు పౌరజ్ఞానం, సామాజిక బాధ్యతలు గల పౌరులుగా తయారవుతారా?
సామాన్యుల ప్రయాణ సాధనాలైన రైల్వే వస్తువులు, బ్యాగులు, విద్యార్థుల పెన్నులు, మాధ్యమాల పరికరాలు, ముడి ప్రింటు, శబ్దనమోదు పరికరాలు, లైసెన్సులు, అచ్చయిన సమాచారం, ప్యాకేజి పెట్టెలపై12 నుండి 18శాతానికి జీఎస్టీ పెంచింది. లోహాలు, తుక్కు, ప్లాస్టిక్‌, పాలిథీన్‌ లపై 5 నుండి 18శాతానికి, విద్యుత్తును పొదుపుచేసే సోలార్‌ కుక్కర్లు, జీవన అత్యవసరాలైన ఇంధన పునరుత్పత్తి పరికారాలపై 5 నుండి 12శాతానికి, పిల్లల పాల డబ్బాలపై 0 నుండి 12శాతానికి జీఎస్టీ విధించింది. సంపన్నులు కొనే బంగారుపై 3శాతం, విలువ రాళ్లపై 0.25 శాతం మాత్రమే ప్రత్యేక స్థాయి పన్నులు వేయడం విచిత్రం.
బీమాపై పన్నును పూర్తిగా తొలగించాలని కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరి, ప్రహ్లాద్‌ జోషి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు రాసిన లేఖల్లో చిత్తశుద్ధిని చూడలేము. తమను కలిసిన ఉద్యోగ ఓటర్ల తృప్తికి, మోడీపై తమ అసంతృప్తితో రాసినవే ఈ ఉత్తరాలు. నిర్మల నిస్సహాయురాలని మోడీ సూత్రధారి అని ఈ వరిష్ట బీజేపీ నాయకులకు తెలియదా? వీరు తమ శాఖలలో ఆశ్రితపక్షపాతులే. ప్రజా పక్షపాతులు కారు. మంత్రివర్గ సమావేశంలో వీరు బడ్జెట్‌ను ఆమోదించారు. బడ్జెట్‌లో అన్యాయాలు వీరికి అప్పుడు కనిపించలేదా?

– సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 9490204545