హిట్లర్ నాజీ, ఫాసిస్టు పాలన ఎంతటి భయంకరంగా ఉండేదో ప్రపంచం ఇంకా మరిచిపోలేదు. మనుషుల్ని విభజించి నాటిన విషబీజం అరవై లక్షల మంది యూదుల ఉచకోతకు కారణమైంది. హిట్లర్ ఆనాడు జర్మనీ నేషనలిజం పేరుతో జర్మనీలోని యూదుల వ్యాపార కేంద్రాల న్నిటి పై డేవిడ్ నక్షత్రాన్ని ప్రదర్శించాలని, వారి శరీరం పైన కూడా వారి పేర్లు ప్రదర్శించాలని హుకుం జారీ చేశారు. డేవిడ్ నక్షత్రం యూదు మతస్తుల గుర్తు. తదనంతరం యూదులను గుర్తించి వారి వ్యాపార కేంద్రాలను స్వాధీనం చేసుకోవ డం, ఆ తర్వాత వారిని నిర్బంధ కేంద్రాలకు పంపడం, అరవై లక్షలమంది యూదులను హతమార్చడం, రెండు కోట్ల మంది ప్రజలు,సైనికులు ప్రాణాలు కోల్పోవటం చరిత్ర చెప్పే సత్యం. సరిగ్గా అలాంటి విభజనకు బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఆజ్యం పోస్తున్నాయి. నాడు మనుషులను విభజిస్తే, నేడు యూపీలోని యోగి ప్రభుత్వం హిందూ, ముస్లింలను విభజిస్తూ పాలిస్తోంది.
కన్వర్ యాత్ర. ప్రతి ఏటా శ్రావణ మాసంలో హిందువులు పవిత్రంగా భావించే గంగా జలాన్ని హరిద్వార్ నుండి కావడిలో కాలినడకన తెచ్చి తమ గ్రామాల్లోని శివాలయాల్లో అభిషేకం కోసం భక్తులు ఢిల్లీ హరిద్వార్ జాతీయ రహదారిపై లక్షల సంఖ్యలో భక్తులు కాలి నడకన ప్రయాణించటం పరిపాటి. ఈ యాత్ర ఈనాటిదికాదు. శతాబ్దాలుగా సాగుతున్న యాత్ర. ఈ యాత్రలో పంజాబ్, రాజస్థాన్, హరి యాణా, ఢిల్లీ,యూపీ, మధ్యప్రదేశ్ ,జార్ఖండ్, ఒరిస్సా రాష్టాల నుండి కూడా కన్వర్ యాత్రలో పాల్గొనటం ఆనవాయితీ. హరిద్వార్ నుండే కాకుండా గంగోత్రి, బీహార్‌లోని హజారీబాగ్ దగ్గరలోని గంగానది నుండి కూడా కావడి పాత్రల్లో జలాన్ని సేకరించటం ఎప్పుడూ జరుగుతున్నదే. కానీ ఈ యేడు ఉత్తరప్రదేశ్ బీజేపీ యోగి ప్రభుత్వం ఒక ఫర్మానా జారీ చేసింది. ఢిల్లీ -హరిద్వార్ జాతీయ రహదారి పొడవునా వున్నా దాబాలు,హోటళ్లు, పండ్లు, కూరగా యలు బండ్లపైన ఆఖరికి రేషన్ దుకాణాల పైన యజమానులు, అందులో పనిచేసే వర్కర్ల పేర్లు ప్రముఖంగా ప్రదర్శించాలని ఉత్తర్వు లిచ్చింది.దీన్నిచూసి ఉత్తరాఖండ్ ప్రభు త్వం కూడా ఇదే ఆర్డర్ ఇచ్చింది. ఇలాంటి ఆర్డర్ ఇవ్వటంలో ఏ అంశాలు ఆ ప్రభుత్వాలను ప్రేరేపించినవో పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా రాజకీయ,ఆర్థిక కోణాలతో పాటు మతవిభజన కూడా ఇమిడి వున్నట్టుగా తెలుస్తోంది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో యూపీ, ఉత్తరాఖండ్ బీజేపీ పభుత్వాలకు ఆ మాటకొస్తే మోడీ,షాలకు అక్కడి ఓటర్లు వారు ఊహించని ఫలితాలనిచ్చారు. ఈ యాత్ర మార్గంలో వున్నా షహారన్పూర్ డివిజన్‌లో తుడిచి పెట్టుకుపోయింది. అంతేకాకుండా శామిలి, ముజఫర్‌గర్ సీట్లలో ఇండియా బ్లాక్ గెలుచుకొంది. మీరట్‌లో మాత్రం బీజేపీ తక్కువ మెజారిటీ సాధించింది.కాంగ్రెస్ గెలుచుకున్న ముజఫర్‌నగర్ సీట్ హరిద్వార్ దగ్గర్లో ఉండటం ఇటీవల ఉత్తారాఖండ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో హరిద్వారాను అనుకోని వున్న మంగ్లర్ ,బద్రీనాథ్ అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలవటం, త్వరలో యూపీలో పది సీట్లలో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీి గెలవాలంటే మెజార్టీ, మైనార్టీ విభజన తెచ్చి మతకలహాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. అందుకే బీజేపీ కుట్రలో భాగంగా ఏ హోటళ్లపైనా, కూరగాయలు, పండ్ల బండ్ల పైన, ఆఖరికి రేషన్ దుకాణాలపైనా యజమానులు పేర్లు రాయాలని తద్వారా ఉద్రేకాలను, ముస్లిం యజమానులు వ్యాపారం మూసివేసి పెద్ద పెద్ద, ఇతర మతస్తుల వ్యాపారాలకు ఆర్థిక లాభం చేకూర్చమే ఈ ఉత్తర్వులకు సారాంశమని రాజకీయ పరిశీలకుల అంచనా.
2023 యాత్రలో మొత్తం కావడి యాత్రలో వివిధ ప్రాంతాల్లో సుమారు రెండు కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు.అందులో కోటి మంది ఢిల్లీ – హరిద్వార్ జాతీయ రహదారి నుండే ప్రయాణించారు.ఈ మార్గంలో బీజేపీ నాయకుడు, ఛాందసవాది అయిన యాశ్వీర్ షామిలి రోడ్డులో ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఇది ముజఫర్‌నగర్ దగ్గర్లోని బాంగ్రాలో వుంది. ఈయన మూడేండ్ల క్రితం ఒక 50 డాబాలను గుర్తించి, అవి ముస్లింలు యజమానులవని, శాఖాహారం పేరుతో హిందూ దాబాలుగా నడుపుతున్నారని, ఆ హోటళ్లలో కన్వర్ యాత్రికులు భోజనం చేస్తే కరప్ట్ అవుతారని, కాబట్టి వాటిని యాత్ర జరిగినన్ని రోజులు మూసెయ్యటమో లేక ముస్లింల పేరు హోటళ్లపై రాయాలని ముజఫర్ నగర్ పోలీసుకు పిటిషన్ ఇచ్చాడు.కానీ పోలీసులు పట్టించుకోలేదు.దీంతో ఆయన ముజఫర్‌నగర్‌లో ధర్నా చేసి మతాన్ని రెచ్చగొట్టేలా విద్వేష ప్రచారానికి ఆందోళనను చేపట్టి శాంతిభద్రతల సమస్యను సృష్టించాడు.దీంతో పోలీసులు 2022లో ముస్లిం హోటళ్ల యజమానులు పేర్లు, వర్కర్ల పేర్లు సేకరించారు.ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే హిందూ వర్కర్లు ముస్లింల దాబాల్లో, ముస్లిం వర్కర్లు హిందువుల దాబాల్లో పనిచేయటం. 2023లో పోలీసులు ముస్లిం దాబాలను అనధికారంగా మూసివేయించారు. ఈసారి ఏకంగా యోగి ఒక అడుగు ముందుకేసి హోటళ్లు, దాబాలే కాకుండా పండ్లు, కూరగాయల తోపుడు బండ్లు,ేషన్ దుకాణాల పైన యజమానులు,వర్కర్ల పేర్లు ప్రదర్శించాలి అని ఉత్తర్వులిచ్చారు. దీన్ని చూసి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇదే తరహా ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి యాత్ర సజావుగా జరగటానికి ముస్లింల సహాయ సహకారలం దిస్తున్నారు. జనాభా ఎక్కువగా వున్న ప్రాంతాలు, యాత్ర మార్గంలో ముస్లిములు మంచినీరు, భోజనాలు, మెడిసిన్స్ ఏర్పాటు చేయటం గత పదేండ్ల నుండి అక్కడ జరుగుతోంది. కానీ యోగి ప్రభుత్వం మాత్రం హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు నింపే ప్రయత్నం ఏకధాటిగా కొనసాగిస్తూనేవుంది.
ఇదిలా ఉండగా ఈ అంశంపై సుప్రీంకోర్ట్‌ను పిటిషన్ దాఖలైంది. ఇద్దరు సభ్యులు గల బెంచ్ యోగి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమైనదని కొట్టివేసింది. కేవలం దాబాలు హోటల్స్ కేవలం శాఖాహారమా, మాంసాహారము తెలుపుతూ దాబాలు, హోటల్స్ ప్రదర్శించాలని ఉత్తర్వు లిచ్చింది. ఈ బెంచ్‌లో సభ్యుడైన ఎస్‌వి యెన్ భట్టి తాను కేరళ హైకోర్టులో జడ్జిగా పనిచేసే సమయంలో ముస్లింల హోటల్స్‌లోనే శాఖాహార భోజనం చేసేవాడినని, శుచికి, శుభ్రతకు, రుచిగా భోజనం ఉండేదని వ్యాఖ్యానించడం కొసమెరుపు.
– డాక్టర్ కె.సుధాకర్‌రెడ్డి, 8985037713.